ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అన్నది చరిత్రను అడిగితే తెలుస్తుంది. అయిదేళ్ళ క్రితం నాటి విభజనను బట్టి చూస్తే మొదడి సీఎం గా చంద్రబాబు కనిపిస్తారు. అయితే మద్రాస్ స్టేట్ లో ఏపీ ఉందన్న సంగతి ఇప్పటి యువ తరానికి చాలా మందికి తెలియదు. నాడు పొట్టి శ్రీరాములు త్యాగ‌ఫలంగా ఆంధ్రులకు ఒక రాష్ట్రం  లభించింది. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అజేయమైన కీర్తిని సంపాదించుకున్న ఓ  దేశభక్తుడు ఎన్నికయ్యారు.


ఆయనే టంగుటూరి  ప్రకాశం పంతులు గారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు. కానీ ఆయన్ని ఏరి కోరి పిలిచి మరీ నాటి ప్రధాని నెహ్రూ పెద్ద పీట వేశారు. మీలాంటి వారు ముఖ్యమంత్రిగా ఉంటే కొత్త రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నెహ్రూ ఆహ్వానించడంతో  టంగుటూరి ప్రకాశం ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన కేవలం ఏడాది మాత్రమే సీఎం గా పనిచేయంగా అభివ్రుధ్ధి పనులు ఎన్నో చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ ఆయన కాలంలోనే నిర్మాణం జరిగింది. అప్పట్లోనే మధ్యపాన నిషేదానికి ఆయన పూనుకున్నారు.


ఇదిలా ఉండగా 1872 ఆగస్టు 23న నాటి ఒంగోలు జిల్లాలో పుట్టిన ప్రకాశం పంతులు న్యాయ విద్యను అభ్యసించి గొప్ప న్యాయవాదిగా కీర్తిని పొందారు. ఆయన జీవితంలో చూడని డబ్బు లేదు. కోట్లకు కోట్లు సంపాదించి ఆనాడే మద్రాస్ లోని కుబేరుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. గాంధీ పిలుపు అందుకుకుని తన సంపదను, జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టారు. సైమన్ కమిషన్ ఎదురుగా తుపాకీ గుండుకు గుండెను చూపిన యోధుడు.  బ్రిటిష్ వారితో పాటు, యావత్తు ఆంధ్రులందరి చేత ఆంధ్ర కేసరిగా బిరుదు అందుకున్న స్వచ్చమైన నేత. స్వార్ధం లేని నాయకుడు.


ఉమ్మడి ఏపీ కోసం పరితపించి తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండూ  ఒక్కటిగా ఉండాలని చివరి రోజుల్లో ఎంతో తపన పడి గట్టి ప్రయత్నాలు చేసిన ఆంధ్ర ప్రకాశం పంతులు గారు 1956న ఉమ్మడి ఏపీ సాధనను కళ్ళారా చూశారు. ఆ తరువాత కూడా ఆయన రెండు ప్రాంతాల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా చూసే ప్రయత్నంలో వేసవి ఎండలను కూడా లెక్కచేయ‌కుండా అలుపెరగని ప్రయత్నం చేస్తూనే 1957 మే 20న వడదెబ్బ తగిలి హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. తెలుగు వారుగా ఆయన్ని చూసి  అంతా గర్వించాల్సిన రోజు ఈ రోజు.



మరింత సమాచారం తెలుసుకోండి: