అమెరికా పర్యటన నుండి తిరిగొస్తున్న జగన్మోహన్ రెడ్డికి అనేక సమస్యలు స్వాగతం చెప్పటానికి రెడీగా ఉన్నాయి. వరదలు, రాజధాని మార్పు,  పోలవరం హైడల్ ప్రాజెక్టు టెండరు రద్దుపై కోర్టు తీర్పు, కోడెల ఇంట్లో దొంగతనం ట్విస్ట్ లాంటి అనేక సమస్యలు కీలకంగా మారాయి. సరైన దిశానర్దేశం కోసం మంత్రులు, ఉన్నతాధికారులు జగన్ రాక కోసమే ఎదురు చూస్తున్నారు.

 

అమెరికా పర్యటన ముగించుకుని జగన్ భారత్ కు బయలుదేరారు. శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకోగానే లోటస్ పాండ్ లోని తన నివాసంలో అవసరమైన మంత్రులు, ఉన్నతాధికారులతో జగన్ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఎక్కడో మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకే ఏపిలోని కొన్ని జిల్లాలు వరదలతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ వరదల వల్లే చంద్రబాబునాయుడు అండ్ కో బురద రాజకీయాలు చేస్తోంది.

 

సరే మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజధానిగా అమరావతి ప్రాంతం ఎంతమాత్రం సురక్షితం కాదన్నారు. వెలగపూడి, లింగయాపాలెం లాంటి ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం విపరీతంగా ఉందన్నారు. మొన్నటి వరదలకే రాజధాని గ్రామాలు ముంపుకు గురైన విషయాన్ని బొత్సా ప్రస్తావించారు. దాంతో టిడిపితో పాటు మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా జగన్ పై దండయాత్ర మొదలుపెట్టాయి. రాజధానిని మారిస్తే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించాయి. దాంతో ఇపుడు ఇదే సున్నితమైన అంశం అయిపోయింది.

 

ఇక పోలవరంలో హైడల్ ప్రాజెక్టు టెండర్ల రద్దు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన నవయుగ కంపెనీ వాదననే కోర్టు కూడా మద్దతిచ్చింది. కాబట్టి ఇపుడా కేసు విషయంలో ఎలా ముందుకెళ్ళాలన్నది చాలా కీలకమైంది. ఇది కాకుండా విద్యుత్ రంగంలో పిపిఏల సమీక్షపై కేంద్రం మండిపోతోంది. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికవేత్తలతో భేటీల కోసం జగన్ అమెరికాకు వెళ్ళారో లేదో ఇక్కడ సమస్యలు పెరిగిపోయాయి. కాబట్టి తిరిగి వస్తున్న జగన్ కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: