పక్క దేశం పాక్ కు గట్టి పంచ్ పడింది. కాశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్థాన్ లు మాత్రమే తేల్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మూడో పక్షం జోక్యం అనవసరమని, కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా ఆ దేశాలే పరిష్కరించుకోవాలని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుని వ్యాఖ్యలతో పాక్ కు అంతర్జాతీయ వేదికపై మరోమారు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌తో భేటీ అయ్యారు. ఇరువురు దాదాపు గంటన్నర పాటు చర్చించుకున్నారు.  కశ్మీర్ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతంలో ఎవరూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేయకూడదని తేల్చి చెప్పారు. మరోవైపు.. ఈ భేటీలో భారత్, ఫ్రాన్స్  మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాలతో పాటు మరిన్ని కీలక అంశాలను చర్చించుకున్నట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ...


జమ్మూకశ్మీర్ విభజన, 370 రద్దుపై తమకు ప్రధాని మోదీ వివరించారని ఆయన తెలిపారు. ఇరుదేశాలే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, మూడోపక్షం జోక్యం లేకుండా చూసుకోవాలని తాను మోదీకి సూచించినట్లు  ఇమ్మాన్యుయేల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పాక్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇదిలావుంటే.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన లాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో పాక్ చైనా చెంతకు చేరింది. అయితే ఈ అంశంలో చైనా వైఖరిని భారత్ ఖండించడంతో పాక్ ఇరుకునపడింది. దీంతో.. ఈ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో తేల్చుకోవాలని కూడా నిర్ణయించుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ వ్యాఖ్యలతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక అన్న చందంగా తయారయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: