రాజధాని నిర్మాణం విషయంపై రెఫరెండం జరపాలని జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గడచిన మూడు రోజులుగా రాజధాని విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు.

 

అయితే ఈ ప్రాంతం రాజధానిగా ఉండేందుకు ఏమాత్రం సురక్షితం కాదని అందరికీ తెలుసు. రాజధాని ఎంపిక పై అప్పట్లో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటితో పాటు అనేక మంది నిపుణులు రాజధానిగా అమరావతి ప్రాంతం వద్దని ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతమే సరైనదని చెప్పినా చంద్రబాబు వినలేదు.

 

ఏడాదికి మూడు పంటలు పండే ప్రాంతం, నదికి ఆనుకుని ఉండే ప్రాంతం, ఓ మాదిరి వర్షం పడితేనే  ముంపుకు గురయ్యే ప్రాంతం, కొండవీటి వాగు పొంగితే జలమయమయ్యే గ్రామాలు అయిన అమరావతి  ప్రాంతాన్నేచంద్రబాబు రాజధానిగా ఎంపిక చేశారు. ఈ ప్రాంతం భూకంపాలకు నిలయమైన ప్రాంతమని నిపుణులు చాలామందే హెచ్చరించారు.

 

సరే కారణం ఏదైనా చంద్రబాబు అమరావతినే రాజధానిగా ఎంపిక చేశారు. తాజాగా ఈ ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించటంపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. అందుకనే రాజధానిగా అమరావతిని కొనసాగించాలా ? లేకపోతే మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాలా ? అనే విషయంలో జగన్ ప్రజాభిప్రాయాన్ని (రెఫరెండం) సేకరించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  

రాజధాని రెఫరెండంపై మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. రైతుల నుండి సేకరించిన భూమి ఎంత ? ఉపయోగించింది ఎంత ? ఏ ఏ అవసరాలకు ఎంతెంత భూమిని వాడుకున్నారు ? లాంటి వివరాలను వెంటనే తీసుకురమ్మని సిఆర్డీఏ అధికారులకు జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఆ వివరాలు అందగానే రాజధాని నిర్మాణంపై రెఫరెండం మొదలుపెట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తొందరలోనే రాజధానిపై జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలైతే ఉన్నాయనే తెలుస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: