మార్కెట్ లోకి కొత్త బైక్ వచ్చిందంటే చాలు ఆ బైక్ ను చూడటానికి యువత, బైక్ ప్రేమికులు క్యూ కడుతుంటారు. స్పోర్ట్స్ బైక్ అయితే దాన్ని ఎప్పుడెప్పుడు డ్రైవ్ చేద్దామా అని ముచ్చటపడుతుంటారు. మరి అలాంటి బైకే ఒకటి కరీంనగర్ లో ఉంది. ఆ బైక్ కి చాలా మంది ఫిదా అవుతున్నారు. మరి ఆ బైక్ విశేషాలేంటో చూడండి. కరీంనగర్ జిల్లాలో ఓ రైతు కుమారుడు వినూత్నంగా ఆలోచించాడు. వ్యవసాయ పనులు చేస్తూ ఇబ్బంది పడుతున్న తన తండ్రి కాష్టాలు గట్టెక్కించాలని ఆలోచించాడు.


అనుకున్నదే తడవుగా ఏదైనా చిన్నపాటి బైకు కొనివ్వాలని ఆలోచించాడు. అయితే ఏ బైకు కొనుగోలు చేసినా లీటర్ పెట్రోల్ కు కనీసం డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు చెల్లించాల్సిందే. అసలే కష్టాల ఊబిలో ఉన్న రైతన్నకు మరింత భారంగా మారుతుందని భావించిన రైతు లింగయ్య కుమారుడు బ్యాటరీతో నడిచే ఆటోమెటిక్ బైకును సంగారెడ్డిలో కొనుగోలు చేశాడు. ఇంకేముంది దీన్ని తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతే అప్పటి వరకు ఎవరో తెలియని లింగయ్య ఇప్పుడు స్థానికంగా సెలబ్రిటీగా మారాడు. ఈ చార్జింగ్ బైక్ పై వ్యవసాయ పనులు చాలా ఈజీగా చేసుకుంటున్నాడు రైతు లింగయ్య.


అంతేకాదు స్థానికంగా ఈయన చాలా ఫేమస్ అయ్యాడు. రోడ్డుపైకొస్తే చాలు ఫొటో అంటూ వెంటపడుతున్నారనీ చెప్తున్నాడు. ఈ బైకుకు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే నలభై ఐదు కిలోమీటర్లకు ప్రయాణం చేయొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా చుట్టు పక్కల గ్రామాల్లో బైక్ పై హ్యాపీ గా తిరిగొస్తున్నాడు రైతు లింగయ్య. పొలానికి అవసరమయ్యే యూరియా బస్తాలను కూడా తరలిస్తున్నాడు. తన బైక్ ను చూసిన చాలా మంది ముచ్చట పడుతున్నారని చెబుతున్నాడు. మొత్తంగా తండ్రి కష్టాన్ని చూసిన కుమారుడు చార్జింగ్ బైక్ కొనివ్వడంతో ఇప్పుడు లింగయ్య తన పనులు తానే చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: