ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న సమయం ఆసన్నమైంది. తెలుగు నేలపై ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి ఎక్స్ ప్రెస్ ఉదయ్ పరుగులు తీసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల ఇరవై ఏడు నుంచి విశాఖపట్నం, విజయవాడ మధ్య వారానికి ఐదు రోజుల పాటు ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణీకుల సౌకర్యానికి పెద్ద పీట వేయటంతో పాటు అనేక విశిష్టతలు ఈ రైలు సొంతం.



కలర్ ఫుల్ ఇంటీరియర్స్, ఫ్రీ వైఫై, విశాలమైన గ్లాస్ విండోస్, రెడ్ కలర్ పుష్ బ్యాక్ సీటింగ్ ఎరేంజ్ మెంట్, బయో టాయిలెట్స్, లగేజ్ కోసం ర్యాక్స్ ఏర్పాటు ఇలా ఎన్నో ఆకర్షణలు. కోచ్ మధ్యలోని సీట్లకూ చివరిలోని సీట్లకు మధ్య డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఉదయ్ రైలు ప్రయాణించే సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల మార్గంలో పచ్చటి పొలాలు, అనేక గ్రామాలు పంట కాలువలు, గోదావరి నదీ ప్రవాహం దర్శనమిస్తాయి.



వీటన్నింటిని డబుల్ డెక్కర్ రైలులోని విశాలమైన అద్దాల్లో నుంచి చూస్తూ ప్రయాణించటం మంచి అనుభూతి నిస్తుందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. వాటర్, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. మనం కోరుకున్న డ్రింక్ తాగేందుకు ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ను ఐఆర్ సీటీసీ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తే నేరుగా డైనింగ్ హాలు దగ్గరకు తీసుకొస్తారు. ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలుకు వున్న మరో రెండు ప్రత్యేకతలు సీట్లు ఖాళీగా ఉంటే ఆఖరి నిమిషంలో కూడా టిక్కెట్ లు లభిస్తాయి.



ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఉదయ్ రైలు అందుబాటులోకి రావడం వల్ల రాజధాని అమరావతికి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల కనెక్టివిటికీ మరింత దోహదపడుతుంది. పగటి పూట జన్మభూమి, రత్నాచల్, సింహాద్రితో పలు షెడ్యూలింగ్ రైళ్లు ఉన్నప్పటికీ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదయ్ డబుల్ డెక్కర్ తో కొంత మేర సమస్య తీరినట్లే. ఉదయ్ డబుల్ డెక్కర్ ను దేశంలోనే తొలిసారిగ కోయంబత్తూరు, చెన్నై మధ్య రెండు వేల పధ్ధెనిమిదిలో ప్రవేశపెట్టారు. విశాఖ, విజయవాడల మధ్య పరుగుపెట్టేది రెండవది. గంటకు అరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.



ఒక్కో డబల్ డెక్కర్ కోచ్ లో పైన, కింద కలిపి నూట ఇరవై సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణ సమయంలో ఎక్కువ కుదుపుల్లేకుండా కోచ్ ల మధ్య సీబీసీ కప్లింగ్ ను బ్యాలెన్సు డ్రాఫ్ట్ గేర్ లను అమర్చారు. విశాఖలో ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు మీదుగా ప్రయాణించి పదకొండు గంటల పదిహేను నిముషాలకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి రాత్రి పది గంటల యాభై నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మొత్తంగా ఈ రైలు రాకతో విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: