ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అంశాల్లో పోలవరం రివర్స్ టెండరింగ్ ఒకటి. ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ సంస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ప్రాజెక్టు మధ్యలో ఉండగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం మంచిది కాదని కేంద్రం అంటోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ ప్రాజెక్టుపై సవివరంగా ఓ నివేదిక పీపీఏ ద్వారా కేంద్రానికి అందింది.

 


పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగేళ్ల రిపోర్టును అందజేసింది. ఇప్పటికే నాలుగేళ్ల ఆలస్యమైన పోలవరం ఏపీ ప్రభుత్వ విధానంతో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని పీపీఏ తన నివేదికలో పేర్కొంది. కేంద్రానికి పీపీఏ ఇచ్చిన 12 పేజీల నివేదికలో పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ తో ఎదురయ్యే నష్టాలను సవివరంగా పొందుపరిచింది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పీపీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం మరింత ఎక్కువైతే పోలవరం ప్రాజెక్టుకు అందే ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు కూడా భారంగా మారతాయని పీపీఏ అభిప్రాయపడింది.

 


ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై అన్ని వైపుల నుంచీ ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా నవయుగ సంస్థకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. మరోవైపు సీఎం జగన్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై పట్టుదలగా ఉన్నారు. ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చి ఆలస్యమవుతుందని గడ్కరీ తనతో చెప్పారని చంద్రబాబు అంటున్నారు. అన్ని వైపులనుంచీ వస్తున్న ఒత్తిడితో అమెరికా పర్యటన ముగించుకుని వస్తున్న జగన్ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: