అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు వేగవంతం చేస్తుంది. మొదట అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు ప్రజావేదికతో మొదలు పెట్టిన కూల్చివేతల పర్వాన్ని విశాఖలో కొనసాగిస్తుంది. ముందుగా నగరానికి చెందిన టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే గోవింద్ కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేసింది జీవీఎంసీ. మళ్లీ ఇప్పుడు జిల్లాకు చెందిన మరో టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంతు వచ్చింది.



భీమిలిలోని గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం సక్రమ నిర్మాణం కాదని జీవీఎంసీ పేర్కొంది.అందుకే దాన్ని ఇరవైనాలుగు గంటల్లో తొలగించాలని, లేని పక్షంలో తామే కూలుస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అధికారులు నోటీసులు ఇవ్వడంతో గంటా క్యాంప్ ఆఫీస్ దగ్గర టెన్షన్ నెలకొంది. దీనికి తోడు ఎలక్ట్రికల్ సిబ్బంది, పోలీసులు వచ్చి వెళ్లడంతో గంటా అనుచరులు ఆందోళన చెందారు. ఎప్పుడు కూల్చేస్తారో అని హైరానా పడ్డారు.  



భీమిలిలోని గంటా శ్రీనివాసరావు కార్యాలయానికి భవన నిర్మాణ అనుమతులు లేవని జీవీఎంసీ తెలిపింది.సిఆర్ జెడ్ లో నిర్మించారంటూ గతంలోనే అప్పటి ఇంటి యజమాని కంచర్ల రవీంద్రనాథ్ పేరుతో నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ నోటీసుల నేపథ్యంలో బీపీఎస్ కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అది రిజెక్ట్ అయ్యింది. తాజాగా ఇదే భవనం గంటా కుమార్తె సాయిపూజిత పేరుతో రిజిస్టర్ అయ్యింది. దీంతో మళ్లీ అధికారులు నోటీసులిచ్చారు. భవనం కూల్చివేతకు పూనుకున్నారు. అయితే కూల్చివేతకు ఉపక్రమిస్తే వారం రోజుల గడువు ఇవ్వాలంటూ హై కోర్టు స్టే విధించింది.



దీంతో గంటా కార్యాలయం కూల్చివేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.ప్రభుత్వం తీరు పై ఆయన వర్గీయులు టిడిపి నాయకులు మండిపడుతున్నారు. ప్రతి పక్ష నాయకులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. విశాఖ నగరంలో టిడిపి నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో జీవీఎంసీ కొరడా ఝులిపిస్తుంది. దూకుడును పెంచింది. భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి సంబందించినటువంటి క్యాంప్ కార్యాలయానికి సైతం నోటీసులు జారీ చేశారు. ఇరవై నాలుగు గంటల్లోనే భవనాన్ని కూల్చివేయాలి, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తూ ఆదేశాలు జారీ చేయటంతో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: