కృష్ణా రామా అంటూ కాలం సాఫీగా గడపాల్సిన సమయం, అలాంటి ఓ బామ్మ సొంత భూమిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తుంది. తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న భూమిని అమ్ముకుందామంటే రెవిన్యూ అధికారులు వేధిస్తున్నారు. దీంతో మరణమే శరణ్యమంటూ ఆ వృద్ధురాలు వాపోతుంది. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఈ బామ్మ పేరు పీవీ భానుమతి. భర్త చాలా రోజుల క్రితమే చనిపోయారు. కొడుకులూ, కూతుళ్లూ లేరు. దీంతో ఒంటరిగా జీవనయానం చేస్తుంది. పట్టణంలోని సర్వే నెంబర్ పదిహేడు వందల పన్నెండులో భానుమతికి ఎకరం మూడు గుంటల భూమి ఉంది.


ముప్పై ఐదేళ్లుగా పట్టా పాసు పుస్తకం కూడా ఉంది. డెబ్బై ఏళ్ల బామ్మ ఉన్నదాంట్లోనే తింటూ కాలం వెళ్లదీస్తుంది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఉన్న భూమిని అమ్ముకోవాలని భావించింది. అయితే రెవిన్యూ అధికారులు బామ్మను ఇబ్బంది పెడుతున్నారు. భూమి వివాదంలో ఉందని సెటిల్ చేసుకోవాలని సతాయిస్తున్నారు. చేతగాని వయసులో భానుమతి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. భూమి కోసం పలుమార్లు ప్రజావాణిలో కలెక్టర్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.


గతంలో పని చేసిన తహసీల్దార్ అనుపమ ఆన్ లైన్ లో తన పేరును తొలగించిందని భూమి లేకుండా చేసిందని భానుమతి ఆరోపిస్తున్నారు. న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. దీనిపై ఆవిడ మాట్లాడుతూ, నాకెవరూ వెనకా ముందు లేరు, భర్త లేడు, పిల్లల్లేరు. భర్త పేరు వెంకటమురళి, మనవరాలు  పేరు పీవీ వాల్మీకి దేవి. అక్కడ  భూమి ఎకరం మీద మూడు గుంటల భూమి ముప్పై మూడు సంవత్సరాల నుంచి నా పేరు ఉన్నది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా నా పేరునే రాసిచ్చింది. ఎమ్మార్వో గారు అనుపమ గారొచ్చి ఆ భూమి నా పేరున ఆన్ లైన్ లో నుంచి తీసివేసింది. తీసి మా ఇంటికి వచ్చింది. మా ఇంటికొచ్చి కాంప్రమైజ్ కోసం డబ్బులిద్దామంటే ఆమెకు నేను ఇవ్వలేకపోయా, ఎందుకంటే నేను లేవలేని పరిస్థితి, డబ్బుల్లేని పరిస్థితి.అందుకోసం అని ఆమె నా పేరు తీసివేసింది. ఆ భూమి అమ్ముకుని ఆరోగ్యం బాగోలేకపోయిన, ఏది బాగోక పోయిన అదే డబ్బులతోటి నేను బతకాలి, జీవించాలి. నాకెవ్వరూ లేరు. దయచేసి ఈ గవర్నమెంటు వాళ్ళు సహకరిస్తారని ఆశపడుతున్న అని అమె తెలిపింది. పెద్దపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ మాత్రం అదేం లేదంటున్నారు. ఆన్ లైన్ లో ఎంటర్ చేశామని దరఖాస్తు వచ్చిందని విచారణ జరిపి సరిచేస్తామంటున్నారు. బామ్మ మాత్రం భూమి అమ్మకపోతే తనకు చావే శరణ్యమని రోధిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: