టీఆర్ ఎస్ సీనియర్ నేత గంగుల కమలాకర్ టీఆర్ ఎస్ పార్టీ కి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ ఓ కీలక నేత. కరీంనగర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు గంగుల. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల 2013 లో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం 2014 ఎన్నికల్లో టిఆర్ ఎస్ నుంచి గెలుపొందారు. 2019 లోనూ కరీంనగర్ నియోజక వర్గ ప్రజలు ఆయనకు మరోసారి పట్టం కట్టారు. మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. అనుచర గణం కూడా అంతే బలంగా ఉంది.


ఇంతకీ అసలు విషయం ఏంటన్న ఆతృత మీలో ఉండొచ్చు, ఈ మధ్య కొన్ని అంశాలు ఆయనకు చికాకుగా మారాయట. తెలంగాణలో బిజెపి కాస్త దూకుడు మీద ఉండటంతో కొంత మంది నేతలు కమలం కండువా కప్పుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే కొంత మంది చేరిపోయారు కూడా. అయితే, గంగుల కమలాకర్ కూడా అదే దారిలో ఉన్నారన్న ప్రచారం సాగుతోందట. తనకలాంటి ఉద్దేశం లేదన్నా కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారట. ప్రారంభంలో గంగుల కుంట లైట్ తీసుకున్నా అది కాస్త హద్దు మీరడంతో ఆగ్రహం తెప్పించిందట.


ఈ మధ్య ఆయన కొంత మందిపై కేసులు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. తమ నేతకు అలాంటి ఉద్దేశమే లేదని చెప్పినా పనిగట్టుకుని ప్రచారం చేస్తుండటంతో క్యాడర్ కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. అనవసరపు ప్రచారంతో విసిగిపోయిన గంగుల అనుచరగణం దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గంగుల పార్టీ మారబోతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియో అప్ లోడ్ చేయడంతో, కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంగుల అనుచరులు. ఫేస్ బుక్ లో జరుగుతున్న ప్రచారంపై కూడా వారు కంప్లయింట్ ఇచ్చారు. తమ అభిమాన నేత పరువుకు భంగం కలిగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము తమ అభిమాన నేత ప్రాణం ఉన్నంత వరకు గులాబీ కండువానే కప్పుకుంటామని బల్లగుద్ది చెబుతున్నారు గంగుల కమలాకర్ అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: