ముఖ్యమంత్రి జగన్ దాదాపుగా ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలో లేరు. ఈ మధ్యలో ఎన్నో జరిగిపోయాయి. క్రిష్ణా నది వరదలు ఉవ్వెత్తున వచ్చి ఆగాయి. చంద్రబాబు ఇంటి మీద డ్రోన్లు ఎగరవేయడం ఒక రచ్చ. చంద్రబాబు జనంలోకి వచ్చి జగన్ని ప్రభుత్వాన్ని విమర్శించడం మరో హైలెట్. ఇక పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ రీ టెండరింగ్ కి హై కోర్టు బ్రేక్ వేయడం మరో షాక్. తిరుమల బస్సులో అన్యమత ప్రచారం  చేస్తూ ముద్రించిన టికెట్లు  ఓ గోల, అన్నింటికీ మించి రాజధాని విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తానికి ఇల్లు పీకి పందిరేసిన చందాన వైసీపీ సర్కార్  పరువు ఈ వారం రోజుల్లో దారుణంగా పోయింది.


మరి జగన్ ఇపుడు అమెరికా నుంచి అమరావతి వచ్చేశారు. తాను లేని వేళ జరిగిన నష్టానికి కష్టానికి ఎవరిని బాధ్యులను చేస్తారా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా మంత్రులంతా తలో రకంగా వ్యవహరించారు. . మాస్టార్ స్కూల్ లో లేకపోతే పిల్లలు ఎలా అల్లరి చేస్తారో అలా చేసి పారేశారు. ఒకటా రెండా టీడీపీకి ఎన్ని ఆయుధాలు అందించాలో అన్నీ అందించారు. 
సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు. ఉన్నవీ లేనివీ బయటేసుకున్నారు. మొత్తానికి జగన్ లేని టైంలో ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయలేకపోయారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఈ సందర్భంగా తాను లేని వేళ  జరిగిన రచ్చకు జగన్ బాగా ఆగ్రహంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం అవుతోంది. క్యాబినేట్లోకి సీనియర్ మంత్రులను తీసుకున్నా ఎవరూ కలుగచేసుకోకపోవడమే కాకుండా మరింతగా పరువు తీశారని జగన్ భావిస్తున్నారని టాక్.


ముఖ్యంగా రాజధాని రగడ వైసీపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది కూడా. అది అసలు సబ్జెక్ట్ కానే కాదు. సీనియర్ మంత్రి బొత్స విశాఖలో మీడియా మీటింగ్ పెట్టి చంద్రబాబుని విమర్శించాలనుకున్నారు. అయితే ఓ మీడియా ప్రతినిధి అడిగిన దానికి ప్రతిగా ఆయన అమరావతి విషయంలో రియాక్ట్ అయ్యారు తప్ప అదే చెప్పాలని మాత్రం బొత్స ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ బాబుని విమర్శించడం మాట దేముడెరుగు అసలు ఆయుధాలు అన్నీ ఇచ్చేసినట్లు అయిందిపుడు.


జగన్ ఈ విషయంలో మంత్రులందరికీ క్లాస్ తీసుకుంటారని ప్రచారం అయితే బాగా సాగుతోంది. అదే సమయంలో జగన్ తాను లేని వేళ మంత్రుల పనితీరు కూడా దగ్గరగా గమనించేందుకు అవకాశం కూడా పొందారు. అందువల్ల మంత్రుల పెర్ఫార్మెన్స్ మీద కూడా ఒక అంచనాకు వచ్చిన జగన్ తగిన విధంగా షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ గన్ ఎవరి మీద గురి పెడతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: