జగన్ సర్కారు ఇటీవల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయని.. ప్రముఖ విశ్లేషకులు కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. గతంలో చంద్రబాబు సర్కారు అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణమైన ఇసుక అంశంలో జగన్ సర్కారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయపడ్డారు.


చంద్రబాబును గద్దె దించిన అంశాల్లో ఇసుక సునామీ ఒకటన్న నాగేశ్వర్.. ఇప్పుడు జగన్ సర్కారు హాయాంలోనూ ఇసుక విషయంలో గందరగోళం ఉందన్నారు. కొత్త ఇసుక పాలసీ తెస్తామన్న జగన్.. ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంలో విఫలమవుతున్నారని కె. నాగేశ్వర్ అన్నారు.


గ్రామవాలంటీర్ల నియామకం విషయంలోనూ జగన్ సర్కారు వైఖరిని నాగేశ్వర తప్పుబట్టారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి అరాచకాలు చేశారని కె.నాగేశ్వర్ గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ హయాంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని జగన్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


దీంతోపాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, పోలవరం రీటెండర్లు.. రాజధాని అంశం కూడా ఇటీవల వివాదాస్పదం అయ్యాయని కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. పోలవరం పవర్ ప్రాజెక్టు రీటెండర్లను హైకోర్టు స్టే ఇవ్వడం కూడా జగన్ సర్కారును ఇరుకున పెట్టే అంశమని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.


అదే విధంగా రాజధాని విషయంలోనూ జగన్ సర్కారు గందరగోళంగా వ్యవహరిస్తోందని కె. నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడటం ప్రజల్లో అనుమానాలు పెంచుతుందన్నారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇస్తే బావుంటుందని సూచించారు. ఇక జగన్ సర్కారు నిర్ణయాలపై చంద్రబాబు స్పందిస్తూ.. ఇది పిచ్చి ప్రభుత్వం అని వ్యాఖ్యానించడంపై కె. నాగేశ్వర్ అది రాజకీయ నాయకుల భాషగా కామెంట్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సమాధానం కూడా అదే తరహాలో వస్తుందని నాగేశ్వర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: