ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో గ్రామ, వార్డ్ సచివాలయాలలోని ఉద్యోగాలు భర్తీ చేయబోతూ ఉండటం తెలిసిందే. 1,26,728 ఉద్యోగాలకు 21లక్షల 69 వేల ధరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీలలో గ్రామ, వార్డ్ సచివాలయాల పరీక్షలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. 
 
గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్న వెబ్ పోర్టల్ లోనే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. 1, 3, 4, 6, 7, 8 తేదీలలో ఉదయం సాయంత్రం రెండు పూటలా రాత పరీక్షలు జరుగుతాయని సమాచారం. ఈ ఉద్యోగాలకు ఎక్కువశాతం పోస్టు గ్ర్యాడ్యుయేట్లు ధరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.
 
మొత్తం ధరఖాస్తుల్లో పోస్టు గ్రాడ్యుయేట్లు 42 శాతం కాగా, గ్రాడ్యుయేట్లు 38 శాతం, ఇంజనీరింగ్ అభ్యర్థులు 20 శాతంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి అత్యధికంగా ధరఖాస్తులు రాగా ఆ తరువాత స్థానాల్లో విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఈ పరీక్షల కోసం 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందుతుంది. 
 
సెప్టెంబర్ 1 వ తేదీన జరిగే రాత పరీక్షకు 15 లక్షల 50 వేల మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. మిగిలిన రోజుల్లోని రాత పరీక్షలకు 6 లక్షల 19 వేల 812 మంది  హాజరు కాబోతున్నారు. భారీ స్థాయిలో గ్రామ, వార్డ్ సచివాలయాలలోని ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉండటం పట్ల నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, వార్డ్ సచివాలయాలలోని ఉద్యోగాలకు ఎంపికయిన వారు అక్టోబర్ 2 వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: