వీ 6 న్యూస్ ఛానల్.. తెలంగాణలో పాపులర్ ఛానల్.. తెలంగాణ భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించడంలో నెంబర్ వన్ గా ఉంటుంది. ప్రత్యేకించి ఈ ఛానల్ లో మొదలైన తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదట్లో తీన్మార్ మల్లన్న, మంగ్లి, రాములమ్మ వంటి క్యారెక్టర్లు ఈ ప్రోగ్రామ్ ను సూపర్ హిట్ చేశాయి.


ఆ తర్వాత రాములమ్మ వెళ్లిపోవడంతో సావిత్రి.. తీన్మార్ మల్లన్న వెళ్లిపోవడంతో బిత్తిరి సత్తి క్యారెక్టర్లు వచ్చి చేరాయి. మంగ్లి కూడా వెళ్లిపోయింది. బిత్తిరి సత్తి కారణంగా తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ రేటింగ్ మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో బిత్తిరి సత్తి టీవీ9 ఛానల్ కు వెళ్లిపోవడం ఆసక్తికలిగిస్తోంది.


టీవీ9 ఇటీవల కేసీఆర్ సన్నిహితుడుగా పేరున్న రామేశ్వరరావు చేతికి వెళ్లడం... మొన్నటివరకూ వరకూ టీఆర్ఎస్ లో ఉన్న వీ6 ఛానల్ అధినేత ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడంతో సమీకరణాలు మారుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఉంటే తటస్థంగా లేదా.. ప్రభుత్వ అనుకూల స్టాండ్ తీసుకున్న వీ6 కొన్నిరోజులుగా ప్రభుత్వ వ్యతిరేక గళం అందుకుంది. దీంతో.. వీ6 ఛానల్ ను దెబ్బ తీసేందుకే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు భావిస్తున్నారు.


ఇందులో భాగంగానే ఎక్కువ శాలరీ ఇచ్చి బిత్తిరి సత్తిని టీవీ9 తీసుకుందనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవాదన ఏంటంటే.. టీవీ9 కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. దీంతో వారు కూడా తీన్మార్ వార్తల వంటి ప్రోగ్రామ్‌ను తయారు చేయాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. అందుకే.. బిత్తిరి సత్తికి భారీ మొత్తంలో జీతం ఆఫర్ చేశారని అంటున్నారు. కొన్ని రోజులగా సావిత్రి, బిత్తిరి సత్తి లేకుండానే తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ వస్తోంది. మరి కీలకమైన వారిద్దరూ లేకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తన ప్రత్యేకత నిలుపుకుంటుందా.. మరేదైనా కొత్త క్యారెక్టర్ వస్తుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: