ఇదిగో.. సరిగ్గా ఇలాంటి మాటలతోనే ఓ లాయర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఓ వ్యక్తి నుంచి 78 లక్షల రూపాయలు కాజేశాడు. ఇంతకీ ఈ మోసగాడు.. ఏదో సాదాసీదా వ్యక్తి కాదు.. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో పనిచేస్తున్న న్యాయవాది.. ఆయన పేరు తంగెడ వెంకట శివనాగ సుబ్రహ్మణ్య వరప్రసాద్‌.


అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన కోటగిరి రామారావుకు రెండేళ్ల కిందట న్యాయవాది వరప్రసాద్‌ పరిచయమయ్యాడు. తనకు వీఐపీలు తెలుసునని నమ్మబలికాడు. రామారావు.. తన ఇద్దరి కుమారులకు ఉద్యోగాలిప్పించాలని వర ప్రసాద్ ను అడిగాడు. వరప్రసాద్ తనకు.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో తెలిసిన వారున్నారని, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలిప్పిస్తానని కోతలు కోశాడు.


రామారావు ఆయన మాటలు నమ్మేశాడు.. తన కుమారుల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని ఆశపడి వరప్రసాద్ కు డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు. మొత్తం మీదు ఆర్నెల్ల వ్యవధిలో విడతల వారీగా రూ.78 లక్షలు సమర్పించుకున్నాడు రామారావు. ఇంకేముంది.. మీ అబ్బాయిలకు ఉద్యోగం వచ్చిసినట్టే అంటూ వరప్రసాద్ ఊరించాడు. తీరా చూస్తే.. ఎస్‌.ఎస్‌.సి. ఫలితాల్లో తన కుమారుల నంబర్లు రామారావుకు కనిపించలేదు.


మోసపోయానని గ్రహించిన రామారావు.. తన డబ్బు తిరిగివ్వాలని వరప్రసాద్‌ను అడిగితే.. తప్పించుకోవడం ప్రారంభించాడు.. రేపు, ఎల్లుండి అంటూ వాయిదా లు పెట్టాడు. దీంతో సీన్ అర్థమైపోయిన రామారావు హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులను ఫిర్యాదు చేశాడు. కేసును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు వలపన్ని అతడిని పట్టుకున్నారు. వరప్రసాద్‌ను పట్టుకునేందుకు పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారులమని చెప్పుకుని అతడిని కాంటాక్ట్ అయ్యారు. విజయవాడలోని ఓ హోటల్ కు రమ్మన్నాడు వరప్రసాద్.. అక్కడ పోలీసులు అతడిని అరెస్టు చేసి.. హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: