క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..?  సీఎం కేసీఆర్ క‌విత‌కు ఏమైనా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా..? ఇవ్వ‌రా..? ఇప్పుడ ఈ ప్ర‌శ్న‌లు గులాబీ శ్రేణుల‌ను, ముఖ్యంగా ఆమె అభిమానుల‌ను వెంటాడుతున్నాయి. అయితే.. ఈ ప్ర‌శ్న‌ల‌కు త్వ‌ర‌లోనే స‌మాధానం దొరికే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. క‌విత‌కు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.  


పార్ల‌మెంట ఎన్నిక‌ల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమె అనూహ్యంగా బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్ప‌టి నుంచి క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు కొంత దూరంగానే ఉంటున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎక్కువ‌గా కుటుంబంతోనే గ‌డుపుతున్నారు.
నిజానికి.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ అజేయ శ‌క్తిగా ఎదిగినా..క‌విత ఓట‌మిని మాత్రం గులాబీద‌ళం ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాన్ని అందుకుని పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు కారు.. సారు.. ప‌ద‌హారు నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన గులాబీ ద‌ళానికి గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. 


ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క‌విత ఓడిపోవ‌డంతో తెలంగాణ‌లో కీల‌క ప‌రిణామాల‌కు దారితీసింద‌నే చెప్పొచ్చు.  క‌విత ఓట‌మిని.. కేసీఆర్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌గా రాజ‌కీయ‌వ‌ర్గాలు చూశాయి. ఏకంగా బీజేపీ నాలుగు పార్ల‌మెంట్ స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌రికొత్త స‌వాల్ ఎదుర‌వుతోంది. క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ చేతిలో ఓడిపోయిన బోయినప‌ల్లి వినోద్‌కుమార్ ఇటీవ‌ల కేసీఆర్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడిగా ఆయ‌న‌ను నియ‌మించారు. 


దీంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌విత‌కు కూడా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. దీంతో ఆమె మ‌ళ్లీ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఎమ్మెల్సీ కావ‌డంతో ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ ప‌ద‌విని క‌విత‌కు అప్ప‌గిస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్‌ప‌ర్స‌న్‌గా క‌విత‌ను నియ‌మిస్తే.. రైతుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర అవుతార‌ని, అలాగే.. నిజామ‌బాబాద్‌లో మ‌ళ్లీ స‌త్తాచాటే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. మ‌రోవైపు.. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యంగా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఏది ఏమైనా.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత సైలెంట్‌గా ఉంటున్న క‌విత‌.. మ‌ళ్లీ క్రియాశీల‌కంగా ప‌నిచేసే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌న్న‌మాట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: