బిజెపిలో చంద్రబాబునాయుడు పట్టు పెరుగుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అదే అనుమానాలు పెరుగుతున్నాయి. టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలు చంద్రబాబు అనుకూలంగా చక్రం తిప్పటం చూస్తుంటే అందరిలోను అనుమానాలు బలపడుతున్నాయి.

 

దాదాపు నాలుగేళ్ళ క్రితం వరకూ రాష్ట్రం బిజెపి వ్యవహారాలను చంద్రబాబు అనుకున్నట్లే జరిపించుకునే వారు. అందుకు కారణం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు పూర్తి మద్దతుగా నిలబడటమే.

 

అలాంటిది వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుండి నరేంద్రమోడి దూరంగా పంపేశారు. ఎప్పుడైతే వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యారో అప్పటి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి. వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లో ఉండుంటే బహుశా చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేవారు కాదేమో ?

 

సరే దాని తర్వాత ఎన్నికలు రావటం మోడికి వ్యతిరేకంగా చంద్రబాబు జాతీయస్ధాయిలో వ్యతిరేక ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మిగితా రాష్ట్రాల విషయం ఎలాగున్నా ఏపిలో మాత్రం చంద్రబాబు చావుదెబ్బ తిన్నారు. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి ఇబ్బందులు మొదలవ్వటంతో చంద్రబాబు మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

ఇందులో భాగంగానే ముందుగా తనకు అత్యంత సన్నిహితులు, బినామీలుగా ప్రచారంలో ఉన్న సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావుతో పాటు టిజి వెంకటేష్ ను బిజెపిలోకి పంపారు. అప్పటి నుండి ఏపి వ్యవహారాల్లో సుజనా, సిఎం రమేష్ లు చంద్రబాబుకు అనుకూలంగా మలుస్తున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

 

జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కేంద్రమంత్రులు హడావుడి చేస్తున్నపుడు సుజనా, సిఎం రమేష్ లు కూడా వాళ్ళ పక్కనే ఉంటున్నారు. అంటే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లుగా  ఫిరాయింపు ఎంపిలు కేంద్రమంత్రులను మ్యానేజ్ చేస్తున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఫిరాయింపు ఎంపిల స్పీడు పెరుగుతోందంటే బిజెపిపై చంద్రబాబు పట్టు పెరుగుతున్నట్లే అనుకోవాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: