సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు కేంద్రంపై బాగా రెచ్చిపోయారు. కేంద్రం ఈడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని దేశంలోని రాజకీయ నాయకులను బెదిరిస్తుందని ఢిల్లీ వీధుల్లో రంకెలు వేశారు. అంతే కాదు.. దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకం చేస్తానని మీటింగులు పెట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెట్టారు. నచ్చని పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటి వంటి సంస్థల ఉపయోగించి దాడులు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలుస్తున్నాం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పక్క కూర్బోబెట్టుకుని చెప్పారు.


అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు.. అదే కేంద్ర ప్రభుత్వం.. అదే విపక్షాలు.. అవే కేసులు.. తాజాగా ఏకంగా కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని కేంద్రం అరెస్టు చేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు.. అత్యంత కీలకమైన, కేంద్ర మాజీ హోం, ఆర్ధిక శాఖలను నిర్వహించినవాడు.. అలాంటి వ్యక్తిని అరెస్టు చేస్తే.. ఎందుకో చంద్రబాబు నాయుడు కనీసం నోరెత్తటం లేదు. ఇది జాతీయ స్థాయిలో మీడియాను కుదిపేసినా సరే.. గతంలో కేంద్రంలో చక్రం తిప్పిన నేతగా చంద్రబాబు స్పందించనే లేదు.


ఓ ఖండన లేదు.. అలాగని సమర్ధన లేదు. ప్రజాస్వామ్యం ఎప్పుడు ప్రమాదంలో పడినా రెడీమని పరుగెత్తుకొచ్చే చంద్రబాబు ఎందుకు ఈసారి మౌనంగా ఉన్నారు. చంద్రబాబుతో కలసి ఉండే మమతా బెనర్జీ, స్టాలిన్ తోపాటు సీపీఎం నేత ఏచూరి లాంటి వారు కూడా కేసు మెరిట్స్ లోకి పోకుండా చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుపట్టారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారు.


బాబు మౌనం వెనుక అర్దాలు వెదికితే... జగన్ ఓవైపు చంద్రబాబు స్కామ్ లు తవ్వుతున్నారు. కేంద్రం కూడా అవినీతి విషయంలో సీరియస్ గా ఉంది. అసలే రాజకీయంగా కష్టాల్లో ఉన్న ఈ క్లిష్టసమయంలో కోరికోరి కొత్త కష్టాలు తెచ్చిపెట్టుకోవటం ఎందుకనే ఉద్దేశంతోనే చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: