దొంగతనం కేసులో నిందితురాలని విచారిస్తే 20ఏళ్ల క్రితం చేసిన నేరం బయటకు రావడం విచిత్రమే అయినా.. ఇది నిజం. దొంగతనాలే వృత్తిగా ఉన్న సుంకరి భాగ్యలక్ష్మి అనే మహిళ ఈ నెల 22న ఇటివల జియ్యమ్మవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి మాయమాటలు చెప్పి అతని ఇంటికి వెళ్లింది. అదును చూసి ఇంట్లో ఉన్న బంగారంతో పరారైంది. ఆమె బస్సులో ప్రయాణిస్తోందని తెలుసుకున్న గ్రామస్థులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

 


ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రామకృష్ణకు ఈమెను చూడగానే 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ బాలుడి కిడ్నాప్ ఉదంతాన్ని బయటకు తీశారు. అప్పట్లో చీపురుపల్లి మండలం వంగల్లిపేటలో భాగ్యలక్ష్మీ తన పక్కింట్లో ఉండే మండల సూర్యారావు ఇంట్లో 25 తులాల బంగారాన్ని దొంగలించడంతో పాటు ఇంట్లో నిద్రిస్తున్న వారి నాలుగేళ్ల బాలుడు శంకర రావును కిడ్నాప్ చేసింది. చీపురుపల్లి స్టేషన్ నమోదైన ఈ కేసు సంచలనమైంది. ఇప్పటి వరకూ ఆ కేసు తేలలేదు. అక్కడ కానిస్టేబుల్ గా ఉన్న రామకృష్ణ ఇప్పుడు జియ్యమ్మవలసలో హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నారు. అప్పట్లో ఆ కేసు నిమిత్తం మూడేళ్లు తిరిగిన రామకృష్ణకు ఇప్పుడు ఈ దొంగతనం కేసులో భాగ్యలక్ష్మి మళ్లీ తాను పనిచేసే చోటుకే నిందితురాలిగా వచ్చింది. దీంతో ఆమెను లోతుగా విచారించగా 20ఏళ్ల క్రితం ఆ బాలుడిని కిడ్నాప్ చేసింది తానేనని ఒప్పుకుంది. ప్రస్తుతం ఆ బాలుడు రాజమహేంద్రవరంలో ఉంటున్నాడని కూడా చెప్పింది.

 


శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ప్రాంతానికి చెందిన సుంకరి భాగ్యలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది. ఈమె చేసిన కిడ్నాప్ ను చాకచక్యంగా వ్యవహరించి వెలుగులోకి తెచ్చిన హెడ్ కానిస్టేబుల్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: