బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైద‌రాబాద్ వేదిక‌గా క‌శ్మీర్ గురించి ప్ర‌స్తావించారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. 70వ ఐపీఎస్‌ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐపీఎస్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ సంస్థానం విలీనం గురించి, ఇటీవ‌లే క‌శ్మీర్‌కు మిన‌హాయించిన ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి గురించి వివ‌రించారు. 

స్వదేశీ సంస్థానాల విలీనం కోసం  సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని అమిత్‌షా తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం కోసం పటేల్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తాజాగా జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని అమిత్‌షా పేర్కొన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించారు అని అమిత్ షా తెలిపారు. 
 
ఐపీఎస్ సాధించడంతోనే యువత ఆశయం పూర్తయినట్లు కాదని అమిత్‌షా అన్నారు. నిజాయతీగా సేవ చేసి గౌరవం పొందాలి, దేశాభివృద్ధికి పాటుపడాలి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పేదరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలి. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ సత్ఫలితాలు సాధించాలి. రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతినకుండా, ధైర్యంగా విధులు నిర్వహించాలి అని అమిత్ షా ఐపీఎస్‌లకు సూచించారు. 
70వ బ్యాచ్‌కు చెందిన 92 మంది యువ ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో 12 మంది మహిళా ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు ఐపీఎస్‌లను కేటాయించనున్నారు.అమిత్‌షాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారులు పరేడ్‌ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: