ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే త‌న కేబినెట్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సామాజిక కోణాలు, ప్రాంతాల వారీగా మంత్రి ప‌ద‌వులు కేటాయించారు. 9 మంది బీసీలు, న‌లుగురు కాపులు, ఐదుగురు ఎస్సీలు, న‌లుగురు రెడ్లు, ఒక క‌మ్మ‌, మైనార్టీ, వైశ్య ఇలా అన్ని వ‌ర్గాల‌కు త‌న కేబినెట్లో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. మంత్రి ప‌ద‌వి ఆశించిన వారు ఎక్కువుగా ఉండ‌డంతో రెండున్నరేళ్ల త‌ర్వాత 90 శాతం మంది మంత్రుల‌ను తొల‌గించి వారి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. 


ఇదిలా ఉంటే జ‌గ‌న్ కేబినెట్లో ఉన్న వారిలో చాలా మంది ప‌నితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోవడం గ్యారెంటీ అన్న ప్రచారం వైసీపీలో శ్రేణుల్లో సాగుతోంది. అంతెందుకు జ‌గ‌న్ తాజాగా అమెరికా పర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ఎవ‌రికి వారు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా మాట్లాడి ప్రభుత్వం, జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో లేనిపోని అపోహ‌లు వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌య్యారు.


ఇక రెండున్న‌రేళ్ల త‌ర్వాత ప‌ద‌వులు ఊడే వాళ్ల‌ను ప‌క్క‌న పెడితే ఓ ఐదుగురు మంత్రుల విష‌యంలో మాత్రం జ‌గ‌న్ చాలా పాజిటివ్‌గా ఉన్నార‌ని.. వారి ప‌ద‌వుల‌కు వ‌చ్చిన ఇబ్బందులు ఏం ఉండ‌వ‌ని అంటున్నారు. ఈ చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో సాగుతోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జ‌గ‌న్ మెచ్చిన మంత్రుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.


గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రులుగా ఉన్నారు. వీరిలో మోపిదేవి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ, బోస్ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయారు. అయినా జ‌గ‌న్ వీరికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. మోపిదేవి జ‌గ‌న్ కోసం ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొన్నారు. ఇక బోస్ వైఎస్ ఫ్యామిలీకి ఎంత వీర‌విధేయుడో తెలిసిందే. ఈ ఇద్ద‌రు నేత‌లు బీసీలే.


ఇక జగన్ కు అన్నిర‌కాలుగా అండ‌గా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి. వైసీపీ సీనియర్ నేతల్లో ఒక‌రు. ఆయ‌న జ‌గ‌న్ కోసం చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క నేత‌ బొత్సా సత్యనారాయణ, పాదయాత్రలో జగన్ కు తోడుగా నడిచిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిలు కూడా ఐదేళ్లు మంత్రులుగా కొన‌సాగుతార‌నే టాక్ వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: