ప్రభుత్వ పథకాల లబ్ది కోసం ఈ కేవైసీ చేయించుకోవటానికి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ క్యూలైన్లు, సర్వర్ సమస్య, ఇంటర్నెట్ సమస్య, సిబ్బందిలో అవగాహన లేమి, ఆధార్ సెంటర్ల కొరత, ప్రజల్లో అవగాహన లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలకే నష్టం జరుగుతోంది. వచ్చే నెల రేషన్ అందుతుందని గ్యారంటీ ఉన్నా సెప్టెంబర్ తర్వాత పరిస్థితిపైనే అందరికీ ఆందోళన కలుగుతోంది. దీంతో ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రజలు ఆధార్ నమోదు సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.

 


రేషన్‌ పొందాలన్నా, ఇతర ప్రభుత్వ పథకాలు అందాలన్నా ఆధార్‌ అనుసంధానం తప్పని సరి చేయడంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ప్రాంతీయ ఆధార్ కార్యాలయం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈకేవైసీ నమోదుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. కానీ సరైన సౌకర్యాల లేకపోవడంతో ప్రజల రద్దీ తగ్గడం లేదు. విజయనగరం పట్టణంలోని ఓ ప్రధాన మీసేవా కేంద్రం వద్ద ఆధార్‌ కోసం ఈరోజు ఉదయం నుంచీ ప్రజలు బారులు తీరారు. అక్కడ 4000 మందికి పైగా లబ్దిదారులు లైన్లో నుంచుంటే సిబ్బంది మాత్రం కేవలం 2000 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. దీంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తూ మీసేవా సిబ్బందితో వాగ్యుద్దానికి దిగారు.

 


రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది పట్టించుకోవట్లేదనే ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. రద్దీని గమనించిన ప్రభుత్వం నిర్దేశిత తేదీని సెప్టెంబర్ 15 వరకూ పొడిగించింది. రద్దీ తగ్గించేందుకు స్కూలు పిల్లల కోసం స్కూళ్లలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇంకా ఎక్కడా ఇది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను పాలకులు పట్టించుకోవాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: