క్రికెట్ లో ఒక దశలో ఓ వెలుగు వెలిగిన కేరళ స్పీడ్ స్టర్, ఇండియన్ క్రికెట్ పేసర్ శ్రీశాంత్ నిత్యం ఏదొక రూపంలో వార్తల్లో ఉంటూంటాడు. మొన్నటికి మొన్న బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీం తగ్గించిన ఆనందంలో ఉన్న శ్రీశాంత్ కు మరో రూపంలో చేదు వార్త ఎదురైంది.

 


శ్రీశాంత్ నివాసంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని తిరువనంతపురం ఎడపల్లిలో ఉన్న శ్రీశాంత్ నివాసంలో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుఝామున 2 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో శ్రీశాంత్ నివాసంలో లేడు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం. అతని భార్యా, పిల్లలు నిద్రలో ఉన్న సమయంలో ఇంటి మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన ఓ వ్యక్తి వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు. ఇంటి అద్దాలు పగులగొట్టి ఇంట్లోవారిని కాపాడారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదం నుంచి శ్రీశాంత్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. అయితే.. మంటలు బాగా వ్యాపించడంతో భారీ మొత్తంలో ఆస్తినష్టం జరిగినట్టు సమాచార. సీలింగ్ ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని శ్రీశాంత్ తెలిపాడు.



2013లో జరిగిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్ కు ఇటీవలే సుప్రీంలో ఊరట లభించింది. జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించడంతో ఇప్పటికే ఆరేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న శ్రీశాంత్ కు మరో ఏడాదితో నిషేధం పూర్తవుతోంది. తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌ మన్ ఇచ్చిన ఆదేశాల‌తో పరిస్థితులు అనుకూలిస్తే శ్రీశాంత్ మ‌ళ్లీ 2020లో క్రికెట్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: