జగన్ని జనం ఎన్నుకున్నది తమ నెత్తిన పాలు పోయమని కానీ, పన్నులు వేయమని కాదు, పైగా ఏపీ అన్నివిధాలుగా చితికిపోయి ఉన్న రాష్ట్రం. అనవసరమైన‌ హంగామాలు చేసి అయిదేళ్ళ పాటు ఏపీని లూటీ చేసిన తెలుగుదేశానికి ప్రజలు అందుకే తగిన గుణపాఠం చెప్పారు. ఉమ్మడి ఏపీ మాదిరిగానే విభజన ఏపీని చూడడం వల్లనే ఖర్చులు తగ్గించుకోకపోవడం వల్లనే బాబుకు జనం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సీట్లు ఇచ్చి ఇంటికి పంపారు.


ఇదిలా ఉండగా అమరావతి రాజధాని ఉండాలని కోరుతున్న వారు లక్షల కోట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు. రాజధానికి కేంద్ర సాయం ఎంత ఉందో అందరూ చూస్తున్నదే. పేద రాష్ట్రంగా ఉన్న ఏపీ ముందు పాలనాపర‌మైన రాజధాని కోరుకుంటోంది. అంతే తప్ప ప్రపంచ స్థాయి రాజధాని, బాహుబలి సెట్టింగులు కోరడంలేదు. ఆ విధంగా అప్పులు కుప్పలుగా తెచ్చి భావి తరాల నెత్తిన వేల కోట్లు అప్పులు చేయమని కూడా ఎవరూ ఆశించడంలేదు.


జగన్ కి కానీ వైసీపీకి కానీ అమరావతి రాజధానిని కట్టకూడదని ఏమీ లేదు. అయితే అక్కడ ప్రక్రుతిపరమైన ప‌రిస్థితులు ఓ వైపు ఆందోళనకరంగా ఉంటే అక్కడ కడితే అప్పులు ఇవ్వలేమని ఓ వైపు ప్రపంచ బ్యాంక్ చేతులెత్తేసిన వైనాన్ని కూడా వైసీపీ సర్కార్ సీరియస్ గానే పరిశీలిస్తోంది. అంతే కాదు. అక్కడ సారవంతమైన భూములు లాక్కుని ఏమీ చేయకుండా మిగిల్చిన వైనంతో రైతులు రెంటికి చెడిన రేవడిగా మారారు. నిజంగా చంద్రబాబు ఓడిపోయి అద్రుష్టవంతుడు అయ్యారు కానీ ఆయన సైతం అమరావతి రాజధాని కట్టలేరన్నది రాజకీయ తెలివిడి ఉన్నవారు అంతా అంగీకరించే విషయం.


ఈ క్రమంలో అమరావతిలో పాలనాపరమైన రాజధాని భవనాలు నిర్మించుకుని, అభివ్రుధ్ధి వికేంద్రీకరించడానికి జగన్ సర్కార్ ప్రయత్నం చేయాలి. లేకపోయినా దొనకొండ వద్ద రాజధానిని నిర్మించినా ఏపీ ప్రజలు ఎవరూ బాధపడరు, ఆందోళనలు అంతకంటే రావు, రియల్ బూం అన్నది పాలపొంగు లాంటిది. అది ఉన్నది లేనిది రెండూ భ్రమలే. అమరావతిలో ఇపుడు రాజధాని ఉందని ఎవరూ అనుకోవడం లేదు కూడా. అందువల్ల జగన్ సర్కార్ ధైర్యంగా అడుగులు వేసి మంచి రాజధానిని అన్ని వర్గాల ప్రజలకు ఆమోదంగా తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేలా నిర్మించుకుంటే దానికి కేంద్ర సాయమే కాదు, ప్రపంచ బ్యాంక్ సాయమూ లభిస్తుంది. ఏపీ ప్రజల మద్దతు మొత్తం లభిస్తుంది. ఇదే 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: