ఏపీలో జగన్ పాలన దూకుడు మీద ఉంది. మొదటి రెండు నెలలూ ఏ విధమైన ఇబ్బందులు లేకపోయినా మూడవ నెల నుంచి మాత్రం మెల్లగా మూడ్ మారుతూ వస్తోంది. జగన్ పాలనకు కొన్ని అవరోధాలు,  బ్రేకులు పడుతున్నాయి. ఇందులో కోరి తెచ్చుకున్నవి కొన్ని అయితే , టెక్నికల్ గా మరికొన్ని రాజకీయంగా ఇంకొన్ని  ఇబ్బందులు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే జగన్ వేగానికి ఎక్కడికక్కడ బ్రేకులు  చాలానే పడుతున్నాయి. దాంతో ఏ విధంగానైనా ముందుకు వెళ్ళాలనుకుంటున్న జగన్ తాజాపరిణామాలతో షాక్ తినాల్సివస్తోంది.


పోలవరం విషయమే తీసుకుంటే జగన్ కి హైకోర్టు నుంచే షాక్ తగ్లింది. హైడల్ ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేయవద్దు అంటూ హైకోర్టు స్టే ఇచ్చేసింది. నవయుగకు అనుకూలంగా, జగన్ కి వ్యతిరేకంగా వచ్చిన ఈ పరిణామం వైసీపీ సర్కార్ లో  ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా నుంచి నిన్ననే వచ్చిన జగన్ వస్తూనే అర్జంట్ గా అధికారులతో ఈ అంశంపైనే చర్చించారట. సుదీర్ఘంగా సమీక్ష కూడా చేశారట. ఏ విధంగాప్రభుత్వం ఈ విషయాన్ని అధిగమించాలన్నది ఇపుడు జగన్ సర్కార్ ని వేధిస్తున్న ప్రశ్న.


ఎట్టి పరిస్థితుల్లోనూ రివర్స్ టెండరింగ్ కి వెళ్తామని ప్రభుత్వం గట్టిగా చెబుతున్న వేళ దానికి గల అవకాశాలు, న్యాయపరంగా కలిగే ఇబ్బందులను కూడా పూర్తిగా పరిశీలించాలని జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అదే సమయంలో న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి ఈ వ్యవహరాన్ని ఓ కొలిక్కి తేవాలను కూడా జగన్ భావిస్తున్నారు. మరో వైపు పోలవరం అధారిటీ కూడా రివర్స్ టెండరింగ్ వద్దు అంటూ కేంద్రానికి రాసిన లేఖ కూడా జగన్ సమీక్షలో ప్రధాన చర్చనీయాంశం అయింది.


ఇప్పటికి డెబ్బయి శాతం పైగా పూర్తి అయిన పనులల్లో మళ్ళీ  మళ్ళీ  బ్రేకులేసుకుంటూ పోతే ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ప్రశ్నార్ధకమేనని కూడా పోలవరం అధారిటీ వాదిస్తోంది. కోర్టుల చుట్టూ తిరిగిగే పోలవరం ఎప్పటికీ పూర్తి కాదని కూడా అంటోంది. నవయుగ కాంట్రాక్టుని  రద్దు చేస్తే నష్ట పరిహారం ఇవ్వాలని అది తడిసి మోపెడు అవుతుందని కూడా హెచ్చరిస్తోంది. అయితే జగన్ మాత్రం పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కి వెళ్ళాలనే గట్టిగా  భావిస్తున్నారు. కేంద్రంతోనే ఈ విషయంలో అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటున్నారని భోగట్టా.  



జగన్  జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతరాష్ట్ర మండలి స్థాయి సంఘం సమావేశంలో ఆయన పాల్గొంటారు.  అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం సభ్యుడిగా జగన్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం జగన్ అమిత్ షాతో  ప్రత్యేకంగా భేటీకానున్నట్లు తెలిసింది. పోలవరం రివర్స్ టెండర్లు తదితర అంశాలపై అమిత్ షా తో జగన్ చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పోలవరం రివర్స్ టెండర్లపై న్యాయనిపుణుల సూచనలు తీసుకోవాలని ఇప్పటికే జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


మొత్తం మీద జగన్ ఢిల్లీ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ అమిత్ షాతో ఏం మాట్లాడతారు, కేంద్రం వైఖరి ఎలా  వుంటుంది. జగన్ చెప్పినట్లుగా కేంద్రం వింటుందా, వినకపోతే జగన్ ఏం చేస్తారు. రాజకీయంగా దీని వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది చర్చగా ఉంది. ఇంకోవైపు కేంద్ర జల వనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రివర్స్ టెండరింగ్ కి పూర్తిగా విముఖంగా  ఉన్న నేపధ్యంలో జగన్ ఎంతగా వివరించినా అమిత్ షా సరేనని అంటారా అన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి జగన్ హస్తిన టూర్ రాజకీయంగా వేడిని రాజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: