ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కన్నీళ్ళు పెట్టుకోవటానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. వైసీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే గా ఉన్న నాగులాపల్లి ధనలక్ష్మి జిల్లా పరిషత్ సమావేశం సాక్షిగా గిరిజనుల సమస్యలను ప్రస్తావిస్తూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. గిరిజనులు ఏం పాపం చేశారు. ప్రతి తల్లీ ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఓవైపు పురిటి నొప్పులు పడుతూనే పుట్టే బిడ్డ సజీవంగా పుడతాడా లేదా అనే ఆందోళనతోనే ఉంటోంది. కొద్దిపాటి అనారోగ్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 


ఏజెన్సీలో ఈ మ‌ర‌ణాలు నిత్య‌కృత్య‌మ‌య్యాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పనితీరును జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీలో గర్భిణీలు తనకు పుట్టే బిడ్డ బతుకుతుంది లేదో అన్న ఆందోళనతోనే ఉంటున్నారని... కేవలం వీరికి సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన వెంటనే చనిపోతున్నారని... ఒక్కసారి తల్లి బిడ్డ కూడా మరణిస్తున్నారని ధనలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు.


కేవలం ఏజెన్సీలోని బిడ్డలు ఎందుకు ? చనిపోతున్నారో అర్థం కావడం లేదని పౌష్టికాహార లోపం లేదా వైద్యం అందడం లేదా ? అన్నది అంతు పట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధ‌న‌లక్ష్మి కన్నీళ్లు పెట్టుకోవడంతో పక్కన ఉన్న ప్రజాప్రతినిధులు ఆమెను ఓదార్చారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు చేస్తామని... ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు.


అందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ప్రతి ఏటా బడ్జెట్ లో రూ. 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ 1070 వ్యాధులకు అందుబాటులో ఉండగా... దీనిని మరిన్ని వ్యాధులకు విస్తరిస్తున్నట్టు కూడా చెప్పారు. ఏదేమైనా ఓ ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేగా అక్క‌డ ప్ర‌జ‌లు ప‌డుతోన్న బాధ‌లు ప్ర‌స్తావిస్తూ ధ‌న‌ల‌క్ష్మి క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం... ఆ ప్రాంతంలో ఉన్న గిరిజ‌నుల బాధ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్ల‌య్యింది. ఇక‌పై అయినా ప్ర‌భుత్వం అక్క‌డ స‌రైన వైద్య సౌక‌ర్యాలు అందించి.. వారి ప్రాణాల‌ను కాపాడ‌డంపై సీరియ‌స్‌గా దృష్టి పెట్టాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: