బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత‌, ఎంపీ సుబ్రమణ్య స్వామి మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త‌దేశ ఆర్థిక‌, భౌగోళిక అంశాల గురించి ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు. ఛండీగఢ్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను (పీవోకేను) భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతే కాకుండా, దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఆదాయం పన్ను (ఐటీ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


పీవోకే అంశంపై ఛండీగఢ్‌లో నిర్వహించిన సదస్సులో సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకే ప్రజలు రోజూ నిరసనలు చేపడుతున్నారని చెప్పారు. అక్కడ నివసించే ప్రజలు పాకిస్థాన్‌లో భాగంగా ఉండేందుకు ఇష్టపడడం లేదని, భారత్‌లో కలువాలనుకుంటున్నారని చెప్పారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్యూన్‌గా అభివర్ణించిన స్వామి.. ఆయనతో భారత్‌ చర్చలు జరుపాల్సి అవసరం లేదన్నారు. 1965, 71, 99లలో భారత్‌తో జరిగిన యుద్ధాల్లో పాక్‌ పరాజయం పాలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అణుబాంబు పేరిట పాక్‌ భారత్‌పై బెదిరింపులకు పాల్పడిందని చెప్పారు. ‘ఇప్పుడేమీ వినిపించడం లేదు. అణుబాంబు ఎక్కడికి పోయింది. దాని బటన్‌ అమెరికా జేబులో ఉంది. పాక్‌ బానిస దేశం. వారు ఆజాద్‌ కశ్మీర్‌గా పిలుస్తున్నారు. నేను దాన్ని గులాం కశ్మీర్‌ అంటా. దానికి మనం విముక్తి కల్పించాలి’ అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.


జీడీపీ తిరిగి గాడిలో పడాలంటే పలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించిన ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీరేటును పెంచాలని, అదేవిధంగా రుణాలపై తగ్గించాలని  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఐటీని రద్దు చేయాలి. ఎఫ్‌డీలపై వడ్డీరేటును పెంచాలి. రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలి. ఈ మూడింటిని ఆచరిస్తే.. ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది అని శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. వచ్చే నెల 5న ఆర్థిక పురోగతిపై ఓ పుస్తకాన్ని తీసుకురాబోతున్నట్లు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: