అమరావతి రాజధాని ఇపుడు ఏపీలో చిచ్చు రేపుతున్న అతి ముఖ్యమైన అంశం. సరిగ్గా  వారం రోజుల క్రితం బొత్స సత్యనారాయణ ఈ అంశంపై సందేహాలు రేకేత్తించేలా విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సంచనల వ్యాఖ్యలు చేశారు. దాంతో అది పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఏపీ రాజధాని అమరావతిని తరలిస్తారన్న ప్రచారం వూపందుకుంది. దీని మీద అమెరికా నుంచి వచ్చిన సీఎమ్ జగన్ కనీసం స్పందించకపోవడంతో బొత్స ముఖ్యమంత్రి మనోభావాల‌నే వెలువరించారని అంతా అనుకున్నారు.


దానికి మరింత బలం చేకూరేలా బొత్స ఈ రోజు విజయన‌గరంలో మాట్లాడుతూ తాను రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ  కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయం మరో మారు వేడెక్కింది. రాజధాని అమరావతిలో నిర్మించడం కష్టసాధ్యమని బొత్స విశాఖ ప్రెస్ మీట్లో చెప్పారు. అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణానికి ఖర్చు అవుతుందని కూడా అయన చెప్పారు. రాజధాని మార్చం అన్న ఒక్క మాట తప్ప మిగిలినదంతా బొత్స ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు.


దాంతో రాజధాని రైతులు కొంతమంది అపుడే ప్రతిపక్షాల చుట్టూ తిరుగుతున్నారు. అమరావతిని మార్చవద్దంటూ బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పవన్ కళ్యాణ్ కూడా భారీ  స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈ నేపధ్యంలో మరో మారు బొత్స అవే వ్యాఖ్య‌లు చేశారు. పైగా తాను చెప్పిన దాంట్లో తప్పులేదని, తాను అన్న మాటలకు కట్టుబడిఉన్నానని కూడా పక్కా క్లారిటీగా చెప్పేశారు.


పైగా పవన్ కళ్యాణ్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కూడా బొత్స విమర్శించారు. రాజ‌దాని విషయం ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుందని, ఇది  చర్చించాల్సిందేనని కూడా ఆయన అన్నారు. మొత్తానికి చూసుకుంటే బొత్సను ముందు పెట్టి ప్రభుత్వం బాంబు లాంటి వార్త ఏదో అమరావతి ప్రాంతానికి వినిపించబోతున్నట్లుగా అర్ధమవుతోంది. తొందరలోనే వైసీపీ సర్కార్ వైఖరి రాజధాని విషయంలో బయటపడనుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: