ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. శనివారం సాయంత్రం వెల్లంపల్లి తల్లి మహాలక్ష్మమ్మ(73) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా.. రేపు అనగా సోమవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. సోమవారం బ్రాహ్మణ వీధిలోని మంత్రి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగియనున్నాయి.


ఇక వెల్లంప‌ల్లి ప్ర‌స్తుతం దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయ‌న గ‌తంలో 2009లో తొలిసారి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలోకి జంప్ చేసిన వెల్లంప‌ల్లి ఆ పార్టీ సీటు ద‌క్కించుకుని విజ‌య‌వాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి జ‌లీల్‌ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లిన ఆయ‌న ఆ పార్టీ న‌గ‌ర అధ్యక్షుడిగా కూడా ప‌నిచేశారు.


తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసిన జ‌లీల్‌ఖాన్ కుమార్తె ష‌బానా ఖాతూన్‌పై విజ‌యం సాధించారు. ఇక జ‌గ‌న్ కేబినెట్‌లో వైశ్య సామాజిక‌వ‌ర్గం కోటాలో వెల్లంప‌ల్లికి దేవాదాయ శాఖా మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఇక వెల్లంప‌ల్లి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పుడు ఆయ‌న కుమారుడు కూడా చిన్న వ‌య‌స్సులోనే అనారోగ్యంతో మృతిచెంద‌డం అప్ప‌ట్లో ఆయ‌న్ను తీవ్రంగా క‌లిచివేసింది.


ఇక రాజ‌కీయంగా ఇప్పుడు కీల‌క‌మైన స్థానంలో ఉన్న ఆయ‌న‌కు ఇప్పుడు మాతృమూర్తి మ‌ర‌ణం ఆయ‌న‌కు మ‌రోసారి ఎదురుదెబ్బ‌గా మిగిలింది. ఇటీవ‌ల ఏపీ మంత్రుల ఇంట్లో వ‌రుస‌గా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఇంట్లోనూ విషాదం చోటు చేసుకుంది. క‌న్న‌బాబు సోద‌రుడు గుండెపోటుతో ఆక‌స్మికంగా మృతి చెందారు. ఇక వెల్లంప‌ల్లి త‌ల్లి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న వైసీపీ నాయ‌కుల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ పార్టీల నేత‌లు ఆయ‌న్ను ప‌రామ‌ర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: