తిరుమల తిరుపతిలో అన్యమత ప్రచారం ఇటీవల రాజకీయ కలకలం సృష్టించింది. తిరుమల ఆర్టీసీ బస్సుల్లోని టికెట్లపై క్రైస్తవుల ఇజ్రాయిల్ పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు ఉండటం విమర్శలకు తావిచ్చింది. జగన్ సర్కారు క్రైస్తవులకు పెద్దపీట వేస్తుందని.. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తోంది ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టేందుకు అవకాశం లభించింది.


ఈ ఘటనతో ఉలిక్కిపడిన సర్కారు .. అసలు తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించింది. దానిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ అంశంపై దృష్టి సారించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ ఆ తర్వాత తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు.


టీటీడీలో ప‌ని చేస్తూ తాను హిందువును కాద‌నే వ్యక్తులు తిరుమ‌ల నుంచి వెళ్లిపోవాల‌ని ఎల్వీ సుబ్రమ‌ణ్యం తెలిపారు. తిరుమల ప‌విత్రత‌ను కాపాడ‌టం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఆర్టీసీ టికెట్ల వెనుక అన్యమత ప్రచారం అంశంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు సీఎస్‌ చెప్పారు.


భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని సీఎస్ అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం వ్యవహారంలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆర్టీసీ ఎండీని ఆదేశించామని సీఎస్ మీడియాకు వివరించారు. తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని సీఎస్‌ స్పష్టం చేశారు.


తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పునఃముద్రణపై టీటీడీ అధికారులతో చర్చించినట్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాల శాస్త్రీయతపై పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. టీటీడీ మ్యూజియంను కూడా అభివృద్ధి చేసి శ్రీవారి భక్తులు వేచిచూసే సమయాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. మొత్తం మీద సీఎస్ ఈ విషయంపై దృష్టి పెట్టడం ద్వారా వివాదాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: