ఈ- కేవైసీ.. కొన్ని రోజుగా ఆంధ్రప్రదేశ్ వాసులను టెన్షన్ పెడుతున్న పదం ఇది. ఆధార్ కార్డును ఈ కేవైసీతో అనుసంధానం చేసుకోవాలని.. లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవీ అందవనే ప్రచారం ఏపీలో బాగా జరిగింది. అందులోనూ ఈ కేవైసీ కి గడువుకు కూడా తక్కువగా ఉండటంతో జనం ఒక్కసారిగా మీసేవ సెంటర్ల ముందుకు బారులు తీరారు. ఈ కేవైసీ కోసం గంటల తరబడి క్యూల్లో నిలుచోడం మొదలుపెట్టారు.


ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారు చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇక ముందు కూడా చేస్తామని చెప్పినవి మేనిఫెస్టోలో ఉన్నాయి. మరి ఆ ఫలాలు అందుకోవాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అన్న ప్రచారం జనంలోకి బాగా వెళ్లింది. అమ్మ ఒడి వంటి పథకాల ఫలాలు అందాలంటే పిల్లల ఆధార్ నెంబర్ ను కూడా ఈ కేవైసీతో అనుసంధానం చేయాలన్న నిబంధనలు ఉన్నాయి.


ఇలా జరిగిన ప్రచారంతో జనం బెంబేలెత్తిపోయారు. ఈ కేవైసీ సెంటర్లకు పరుగులు తీశారు. దీంతో జనం ఆందోళన చూసిన అధికారులు మొదట ఈ కేవైసీ గడువు పెంచుతున్నట్టు ప్రకటన ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ గడువు కూడా లేదని ప్రకటించారు. ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారని డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.


ఈ-కేవైసీ నమోదు చేయించకపోతే కార్డులు తొలగిస్తారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. కడపలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ-కేవైసీ నమోదుపై స్పష్టతనిచ్చారు. ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారంటూ డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంటి బిడ్డలతో గంటల తరబడి ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదన్నారు.


ఈ-కేవైసీకి గడువులేదని.. ఎప్ప్పుడైనా చేయించుకోవచ్చన్నారు. దేశ, విదేశాల్లో వున్న వారు ఈ-కేవైసీలు చేయించడానికి పరుగులు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇలా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావడంతో ఆంధ్రాజనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: