పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో అభిమానం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద్రావిడ ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచి వెలిగిన శిఖరాయమాన నేతగా గుర్తింపు పొందిన డీఎంకే మాజీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం కరుణానిధికి ఆ రాష్ట్రంలో గుడి కడుతున్నారు. తమ కులానికి ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించినందుకు గౌరవ సూచకంగా నమక్కల్ జిల్లాలోని కుచికాడు గ్రామంలోని కొందరు ఈ నిర్ణయం తీసుకున్నారు. 


కరుణానిధి తమ కుల దైవమని అరుంతాతియార్స్ కుల‌స్తులు పేర్కొన్నారు. ``మా అరుంతాతియార్స్ (ఎస్సీ వర్గం) కులానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్‌ను దశాబ్దం క్రితం డీఎంకే హయాంలో కరుణానిధి కల్పించారు. ఆయన గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం`` అని సదరు కులస్థులు తెలిపారు. ఈ. 30 లక్షలతో నిర్మించనున్న ఈ గుడి నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కూడా చేశారు.  కాగా,గ‌త ఏడాది ఆగ‌స్టు 9వ తేదీన క‌రుణానిధి క‌న్నుమూశారు.


కాగా, వెనుకబడిన తరగతుల్లోని ఇసై వెళ్లలర్ (సంగీత శ్రామిక) ఉపకులానికి చెందిన కరుణ తన జీవితంలో ఎక్కువకాలం ద్రవిడ ఉద్యమంలోనే కొనసాగారు. పెరియార్ రామస్వామి నాయకత్వంలో ప్రారంభమైన జస్టిస్ పార్టీలో కరుణ తన 14 ఏటనే చేరారు. పెరియార్ శిష్యుడిగా, అన్నాదురై సహచరుడిగా కరుణ ద్రవిడఉద్యమ భావజాలంలో రాటుదేలారు. స్వీయ ఆచరణతో తనను తాను పరిపూర్ణ హేతువాదిగా తయారుచేసుకున్నారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన పెరియార్, అన్నాదురైలను వారి మరణానంతరం ఖననం చేశారు. వారి మార్గంలో జీవితాంతం నడిచిన కరుణను కూడా వారిలాగే ఖననం చేశారు. 

కాగా, అన్నాదురై మరణం తర్వాత 1969లో తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించిన కరుణానిధి తర్వాత డీఎంకేలో పట్టు సాధించారు. దీంతో డీఎంకేలో కీలక నాయకుడిగా ఉన్న ఎంజీఆర్ బయటికి వచ్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు. తర్వాత తమిళనాడు రాజకీయాలు కరుణానిధి, ఎంజీఆర్ కేంద్రంగా నడిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: