కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఇంట్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. సిద్ధార్థ గత నెల 31న చనిపోయిన విషయం తెలిసిందే. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, తాజాగా ఆయ‌న‌ తండ్రి గంగ య్య హెగ్డే మృతి చెందారు. 95 ఏండ్ల హెగ్డే మైసూరులోని జీజీఎస్‌ఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. నెల రోజులకుపైగా ఈ ఆస్పత్రిలో కోమాలోనే ఉన్న ఆయనకు కొడుకు సిద్ధార్థ మరణవార్త కూడా తెలియదు. 


సిద్ధార్థ మరణం గురించి తెలుసుకోలేని స్థితిలో ఆయన మ‌ర‌ణించిన స‌మ‌యంలో తండ్రి గంగయ్య ఉన్నారు. 95 ఏళ్ల‌ గంగయ్య హెగ్డే మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోమాలో ఉండి ప్రాణాలతో పోరాడారు. సిద్ధార్థ‌ తల్లి వాసంతి కొద్ది రోజుల క్రితమే తమ స్వగ్రామం చీతనహళ్లికి వెళ్లగా, మ‌ర‌ణానికి మూడు రోజుల క్రితం గంగయ్యను ఆసుపత్రిలో చూసి సిద్ధార్థ కంటతడి పెట్టినట్లు సమీప బంధువు ఒకరు చెప్పారు. ఈ క్రమంలో ఇంత ఘోరం జరిగిపోయిందని ఆయన ఇప్పుడు విలపించారు. తండ్రిని చూడటం సిద్ధార్థకు అదే ఆఖరు అవుతుందని తాను ఊహించలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


సంతానం కోసం ఎన్నో నోములు, పూజలు చేసిన గంగ య్య, వాసంతి హెగ్డే దంపతులకు సిద్ధార్థ జన్మించారు. లేకలేక పుట్టిన కొడుకు కావడంతో చిన్నప్పటి నుంచి సిద్ధార్థను అతి గారాబంగా పెంచారు. ముఖ్యంగా తండ్రి గంగయ్యకు కొడుకు సిద్ధార్థ అంటే ఎంతో ఇష్టం. అలాంటి కొడుకు ఆఖరి చూపును కూడా నోచుకోలేకపోయిన గంగయ్య పరిస్థితిని తలుచుకుని అంతా కంటతడి పెడుతున్నారు. హెగ్డే కుటుంబానికి 130 సంవ‌త్స‌రాల‌కు పైగా కాఫీ వ్యాపారంతో సంబంధాలుండగా, కర్నాటకలోని చిక్మగలూరు జిల్లాలో ఓ కాఫీ ఎస్టేట్ వద్ద హెగ్డే కాఫీ ప్లాంటర్‌గా ఉండేవారు. అయితే కాఫీ వ్యాపారిగా మారిపోయిన ఆయన స్థానికంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: