ఉపాధి కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడం సాధారణమైపోయింది. అయితే వీరిలో కొందరు ఆయా దేశాల నిబంధనలు తెలియకుండా అక్కడకు వెళ్తుంటారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు వంటి వారు అమెరికా వంటి దేశాలకు వెళ్తుంటే.. పెద్దగా చదువుకోని వారు.. లేబర్ పనుల కోసం చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అనేక మంది ఏజెంట్లు వీరికి లక్షలు సంపాదించొచ్చని ఆశలు పెట్టి గల్ఫ్ దేశాలకు పంపుతుంటారు.


గల్ఫ్ దేశాలకు వెళ్లివారు అక్కడి చట్టాలు తెలియక ఇబ్బందుల్లో పడుతుంటారు. మరికొందరు యజమానుల అకృత్యాలతో తప్పుడు కేసులతో చేయని నేరాలకు జైలుపావుతుంటారు. అలా భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలా తమదేశంలోని జైళ్లలో ఉన్న 250 మంది ఖైదీలను బహ్రెయిన్ దేశం ఇటీవల విడుదల చేసింది. మానవతా దృక్పథంతో అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 250 మంది భారతీయులను విడుదల చేసింది.


విదేశీ జైళ్లలో ఉన్న భారతీయులకు సంబంధించి మొత్తం 8189 మంది శిక్షలు అనుభవిస్తున్నారు. అందులో సౌదీ అరేబియాలో అధికంగా 1811 మంది, యూఏఈలో 1392 మంది ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీ గల్ప్‌ దేశాల పర్యటనలో భాగంగా యూఏఈకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహ్రెయిన్‌ పర్యటనకు వెళ్లారు. భారతదేశం నుంచి మొట్టమొదటి సారి బహ్రెయిన్‌ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధాని నరేంద్రమోదీయే.


గల్ఫ్‌ దేశాల పర్యటనలో భాగంగా మోదీ తమ దేశానికి వచ్చిన సందర్భంగా బహ్రెయిన్‌ ప్రభుత్వం అక్కడ జైళ్లలో ఉన్న భారతీయులను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ ప్రభుత్వానికి మోదీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధాని మోదీ కార్యాలయం ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది.


‘గల్ఫ్‌ జైళ్లలో మొత్తం భారతీయులు ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియదు. కానీ బహ్రెయిన్‌ ప్రభుత్వం మాత్రం తమ దయాగుణం, మానవతా దృక్పథంతో బహ్రెయిన్‌ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 250 మంది భారతీయులను విడుదల చేసినందుకు ధన్యవాదాలు’ అని పీఎంఓ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: