ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరంలో ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కూడళ్లున్నాయి. నగరం అభివృద్ధి చెందడంతో నేడు అవికాస్త కనుమరుగవుతున్నాయి. దీంతో వాటికి పూర్వవైభవం తీసుకురావాలనే కృతనిశ్చయంతో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ ఎంసీ) చర్యలు చేపట్టింది. భాగ్యనగరి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించేలా కూడళ్లలో నిర్మించిన ఈ కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. దీనిలో భాగంగా నగర నాగరికతను ప్రజలకు తెలిపేందుకు పలు కూడళ్లును అభివృద్ధి చేస్తున్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్‌లలో ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను తెలిపేవిధంగా ఆధునీకరణ పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ కూడళ్లలో లక్డీకాపూల్‌ ఒకటి. ఈ ప్రాంతం నిన్నమొన్నటి వరకూ పాత వాహనాలు, వ్యర్థాలతో ఉన్న స్థలంలో ఇప్పుడు అందమైన గులాబీ తోటను ఏర్పాటు చేశారు.




వేలాది వాహనాలు నిరంతరం ప్రయాణించే ఈ మార్గంలో ఆ స్థలం నిరుపయోగంగా ఇదివరకు అందవిహీనంగా ఉండేది. దీంతో పెద్ద గులాబీ పువ్వు ఆకృతిలో రంగురంగుల విద్యుత్‌ దీపాలంకరణతో ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. దీని వెనుక వైపు అందమైన చెట్లును నాటడంతో సీజనల్‌ పూల వనాలతో ఆకర్షణీయ ఉద్యానవనం రూపుదిద్దుకుంది. అలాగే లక్డీకాపూల్‌లోనే ఒకప్పుడు కర్రల వంతెన ఉండేది. అయితే కాలక్రమంలో అది కనుమరుగయ్యింది. అదే తరహాలో మళ్లీ దాన్ని ఏర్పాటు చేశారు. లక్డికాపూల్ అయోద్య జంక్షన్ వద్ద నిర్మించిన కర్రల వంతెన (లక్డికాపూల్) నమూనాను  హోం మంత్రి మహ్మూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ లు ప్రారంభించారు. జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లోని సంగీత్‌ కూడలిలో ఇదివరకు సంగీత్‌ అనే పేరుతో పెద్ద సినిమా థియేటర్ ఉండేది. దీని స్థానంలో పెద్ద వ్యాపార సముదాయం వచ్చింది. అయితే ఈ సంగీత జంక్షన్‌ను పేరుకు తగ్గట్టుగానే సంగీత వాయిద్యాల నమూనాలను ఏర్పాటు చేశారు.




కుత్బుల్లాపూర్‌ సుచిత్ర కూడలికి ఇరానీ చాయి గేట్‌వేగా పేరుంది. ఇక్కడ ఇరానీ చాయి ప్రతిబింబేంచేలా నీటి ఫౌంటెయిన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఎల్బీనగర్‌లోని చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్‌ వద్ద సరికొత్త ఇతివృత్తాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గం నుంచే రామోజీ ఫిలింసిటీకి వెళతారు కాబట్టి సినిమా షూటింగ్స్ జరుగుతున్నట్లు ఓ వ్యక్తి కెమెరాతో షూట్‌ చేస్తున్నట్లు ఏర్పాటు చేశారు. దీనితో పాటు ఈ కూడలి సమీపంలో హరిణవనస్థలీ జింకల పార్కు ఉండడంతో జింకలతో కూడిన అటవీ ఇతివృత్తం వచ్చేలా ఏర్పాటు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: