టీఆర్ ఎస్ స‌భ్య‌త్వ న‌మోదులో పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల వెనుక‌బ‌డిపోయింది. టాప్ టెన్ నియోజకవర్గాల్లో సిరిసిల్లకు స్థానం దక్కక‌పోవ‌డం టీఆర్ఎస్‌లో చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత… కేటీఆర్ తొలిసారి సభ్యత్వ నమోదు బాధ్యతల్ని అధికారికంగా తీసుకున్నారు. స‌భ్య‌త్వ న‌మోదును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి, పార్టీ యంత్రాంగాన్ని మొత్తం ఉరుకులు పరుగులు పెట్టించారు. 


అయితే రాష్ట్రం మొత్తంపై ప్ర‌ధానంగా దృష్టిపెట్టిన ఆయ‌న  తన సొంత నియోజకవర్గం సిరిసిల్లను లైట్ తీసుకున్నారు. ఫ‌లితంగా టాప్ టెన్‌లోనూ సిరిసిల్ల స్థానం ద‌క్కించుకోలేదు. మొత్తం సభ్యత్వాలపై.. కేటీఆర్ సమీక్ష కూడా చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వం ఎంతెంత అయింది ఆరా తీశారు. నియోజక వర్గాల వారీగా పార్టీ ఇచ్చిన ల‌క్ష్యాన్ని అందుకున్న‌ నేతలను అభినందించారు. అలా అభినందనలు  అందుకున్న టాప్‌ టెన్ నియోజకవర్గాల్లో .. కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


గత ఎన్నికల్లో 90వేల భారీ మెజార్టీతో విజ‌యం సాధించిన కేటీఆర్‌.. ఆ మెజార్టీలో సగం కూడా.. సభ్యత్వాలను సిరిసిల్ల టీఆర్ఎస్ నేతలు చేయించలేకపోయారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు 60 లక్షల సభ్యత్వం నమోదు కాగా, కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ మొద‌టి స్థానంలో ఉంది.  అయితే.. కేటీఆర్.. పార్టీ క్యాడర్ ను… స్ఫూర్తివంతంగా నడపాలంటే.. తన పనితీరు.. అందరి కంటే మెరుగ్గా ఉందని నిరూపించుకోవాల‌న్న భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.


కేటీఆర్ ఇప్ప‌టికే భావి టీఆర్ఎస్ అధినేత అన్న టాక్ బ‌లంగా వ‌చ్చేసింది. తెలంగాణ‌లో జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు కూడా ఈ మాట‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి. కేసీఆర్ మ‌రో  నాలుగేళ్లు ఆయ‌నే సీఎంగా ఉంటారా ?  లేదా ?  మ‌ధ్య‌లో తాను త‌ప్పుకుని త‌న కుమారుడిని సీఎం చేస్తారా ? అన్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌న‌ను తాను మ‌రింత‌గా ఫ్రూవ్ చేసుకోవాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: