దొంగతనాల్లో ఎంత ఆరితేరినవారైనా ఏదొక విషయంలో తప్పు చేస్తారనేది పోలీసుల నమ్మకం. ఎంత పెద్ద కేసులనైనా చేధించేటప్పుడు పోలీసులు ఈ కోణంలో నుంచే ఆలోచించి విచారణ ప్రారంభిస్తారు. దొంగలను పట్టుకోవడంలో ఈ తరహా ఇన్వెస్టిగేషన్ వారికెంతో ఉపయోగపడుతుంది. దొంగతనాలే కాదు మరే ఇతర నేరాలైనా ఇంతే. కంగారులోనో, అతిజాగ్రత్తగానో వ్యవహరించి ఇలా దొరికిపోతూంటారు. ఇలాంటి తరహా తప్పిదమే ఓ మహిళా దొంగ అమెరికాలో చేసి పోలీసులకు చిక్కింది.



తాను దొంగతనం చేయాలని భావించిన సదరు మహిళ తప్పనిసరి పరిస్థితుల్లో తన వెంట బిడ్డను కూడా తీసుకెళ్లింది. దొంగతనం కూడా బాగానే చేసేసింది. అయితే.. దొంగతనం చేసి పారిపోయేప్పుడు తన బిడ్డను మరిచిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వింతగొలిపే ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. స్థానికంగా ఓ మహిళ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఓ షాప్‌కు దొంగతనం చేసేందుకు తన బిడ్డతో సహా వెళ్లింది. స్టోర్ లోకి ప్రవేశించిన తర్వాత తన ఇద్దరు స్నేహితులు స్టోర్‌ సిబ్బందితో మాటలు కలిపి వారి దృష్టి మరల్చారు. తన బిడ్డను స్ట్రోలర్ లో కూర్చోబెట్టి చేయాలనుకున్న పనిని కానిచ్చేసింది. అయితే వెళ్లిపోయే క్రమంలోస్ట్రోలర్‌ లోనే తన బిడ్డను వదిలేసి కంగారులో బిడ్డ సంగతి మరచిపోయింది. ఆమె వెళ్లిన కాసేపటికి తన ఇద్దరి స్నేహితులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు. కాసేపటి తర్వాత కానీ తన బిడ్డ లేని విషయం గ్రహించలేకపోయిందామె. బిడ్డ కోసం తిరిగి స్టోర్‌కు వెళ్లగా.. అప్పటికే చోరీ విషయాన్ని గుర్తించిన సిబ్బంది ఆ మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. 



సీసీ కెమెరాల్లో నమోదైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దొంగతనాల్లో జరిగే తప్పిదాలు ఇలానే పట్టిస్తూంటాయి. కంగారులో దొరికిపోయిన ఘటనలెన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిలో బిడ్డలను ఇరికించటమే బాధాకరమైన విషయం. ఓ సామెత ఉంది.. 'దొంగతనం చేసి పారిపోవడం వరకూ ఓకే.. కానీ మనస్థాపం చెంది ఆ వస్తువు అక్కడ పెట్టడానికి వెళితేనే దొరికిపోతారు' అని. ఈమెలో అలాంటి పశ్చాత్తాపం ఏమీ లేకపోయినా బిడ్డను తెచ్చుకునే క్రమంలో మళ్లీ స్టోర్ కి వెళ్లి కటకటాలపాలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: