హైదరాబాద్ మహానగరంలో మంచి నీటిని పొదుపు చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల మండలి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్టు జలమండలి ఎండీ ఎం. దాన కిషోర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో 2016 నుంచి ఇప్పటీ వరకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు. సోమవారం  న్యూడిల్లీ, చాణక్యపురి హోటర్ అశోకలో నిర్వహించిన జలశక్తి అభియాన్ సమీక్ష మరియు కార్యశాలలో పాల్గొన్నారు. ఈ  వర్క్ షాపుకు కేబినేట్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సిన్హా అధ్యక్షత వహించగా తాగునీరు మరియు పారిశుద్ద్య శాఖ సెక్రెటరీ పరమేశ్వర్ అయ్యర్, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ శాఖ సెక్రెటరీ దుర్గా శంకర్ మిశ్రాలు పాల్గొన్నారు.




ఈ సందర్భంగా ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ.. జలమండలి నూతనంగా తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలను వర్క్ షాపులో వివరించారు. నీటిని పొదుపు చేసేందుకు 2016 నుంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2016లో వంద రోజుల కార్యాచరణ, 2017లో జలభాగ్యం, 2018లో జలం-జీవం, 2019 లో వాక్ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఆయా కార్యక్రమాల ద్వారా మంచినీటిని పొదుపుగా వాడడంపై సమగ్రమైన రీతిలో అవగాహన కల్పించామన్నారు. అంతేకాకుండా  ఇంకుడుగుంతలను నిర్మించుకోవడం వంటి వాటిపై కూడా హైదరాబాద్ జంట నగరవాసులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.



నగరవాసులకు, విద్యార్థులకు మంచినీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు దేశంలోనే రెండవ థీమ్ పార్కును హైదరాబాద్ లో ఏడాది క్రితం నిర్మించినట్లు తెలిపారు. ఇందులో మంచినీటిని ఏవిధంగా పొదుపుగా వాడాలన్న అంశంపై  నగర ప్రజలను చైతన్యపరుస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా వాననీటిని ఎన్ని విధాలుగా ఓడిసి పట్టవచ్చో అందులో అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నట్లు తెలిపారు.
 ఈ ఏడాదిలో చేపట్టిన వాక్ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘ మహిళలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, నగరవాసులు వాలంటీర్లుగా ఉన్నట్లు ఎం.డి దాన కిషోర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: