సింగరేణిలో ట్రేడ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో రెండు నెలల్లో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగుస్తుండటంతో కోల్ బెల్ట్ కార్మికవాడల్లో ఎలక్షన్ హీట్ మొదలైంది. గతంలో గుర్తింపు సంఘం కాల పరిమితి నాలుగేండ్లు ఉండగా టీబీజీకేఎస్ కు రెండేళ్లకే కేంద్ర కార్మికశాఖ ధ్రువీకరణ ఇచ్చింది. దీంతో టీబీజీకేఎస్ గుర్తింపు హోదా పొడిగిస్తారా లేక ఎన్నికలు నిర్వహిస్తారా అనే ప్రశ్న మొదలైంది. ఇరవై ఐదు వేల కోట్ల టర్నోవర్ లక్షల మందికి ఉపాధినిస్తున్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రత్యేకతే వేరు.


ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణిలో జరిగే కోల్ బెల్ట్ రాజకీయాలు అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే సింగరేణి ఎన్నికలను రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో టీబీజీకేఎస్ అధ్యక్షురాలిగా మాజీ ఎంపీ కవిత ఉండటంతో ఎన్నికను సవాల్ గా తీసుకుంది టీఆర్ ఎస్. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారాలు చేశారు.


దాంతో కమ్యునిస్ట్ కంచుకోటలో తొలి సారి గులాబీ జెండా ఎగిరింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో టీబీజీకేఎస్ విజయం సాధించగా, మందమర్రి భూపాలపల్లిలో ఏఐటీయూసీ గెలిచింది. అయితే టీబీజీకేఎస్ గెలిచిన తరువాత గుర్తింపు హోదాను రెండేళ్లకే కుదించింది కేంద్ర కార్మిక శాఖ, ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన గడువు ముగియనుంది.


తమ కాలపరిమితిని కుదించటంపై టీబీజీకేఎస్ కోర్టులో కేసులు వేసింది. నాలుగేళ్ల వరకు గుర్తింపు హోదా వుంచాలని అటు యాజమాన్యం కూడా కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాసింది. దీంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేక హోదా పొడిగిస్తారా అనేది చర్చ నీయాంశంగా మారింది. సింగరేణి యాజమాన్యం కూడా లేఖ రాయటంతో హోదా కాలపరిమితి పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీబీజీకేఎస్ నేతలు. అయితే దీనిపై నిర్ణయం కొద్ది రోజుల్లో తీరనుండగా అటు మిగిలిన కార్మిక సంఘాలు మాత్రం ఎన్నికలు నిర్వహించాలనే భావనలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీబీజీకేఎస్ నెరవేర్చలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: