తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోవ‌డం ఖాయ‌మైంది. కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు తెర‌ప‌డి తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ నేత కొండా సురేఖ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అయితే కేసీఆర్ ఆమెను కరుణించలేదు. దీంతో మనస్తాపం చెందిన సురేఖ టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ నిప్పులు చెరిగారు. అయితే అనూహ్య రీతిలో ఢిల్లీకి వెళ్లారు. త‌న భ‌ర్త కొండా ముర‌ళితో క‌లిసి కాంగ్రెస్ పెద్ద‌ల‌తో సురేఖ స‌మావేశం అయ్యారు. అనంత‌రం పోటీచేయ‌గా..ఓట‌మి పాల‌య్యారు. ఇప్పుడు ఆమె బీజేపీ గూటికి చేరుతున్నారు.


టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంత‌రం సురేఖ మీడియాతో మాట్లాడుతూ,  తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన మొత్తం అవినీతి పాలన అని అన్నారు. కేటీఆర్ కాంట్రాక్టర్ల వద్ద ఎంత కమిషన్ తీసుకున్నారో చెప్పండి అని డిమాండ్ చేశారు. నాలుగేళ్ళలో కేసీఆర్ ప్రజాప్రతినిధులకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కొండా సురేఖ‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలు నిరీక్షిస్తే సోనియా, రాహుల్‌ను కూడా కలవొచ్చు..కానీ ఇక్కడ కనీసం కేటీఆర్ కూడా అపాయిట్మెంట్ ఇవ్వరని కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికే ఎక్కుల పదవులు దక్కాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కవిత, కేటీఆర్, సంతోష్‌లు ఎక్కడ ఉన్నారన్నారు. బంగారు కొండ అన్న కోదండరాంను ఇప్పుడు చవట, దద్దమ్మ అంటున్నారన్నారని విమర్శించారు. కవిత బంగారు బోనం ఎత్తితే బంగారు తెలంగాణ వచ్చినట్టేనా? అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేసీఆర్‌కు మందు గోలీలు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు.


అనంత‌రం కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సురేఖ ఓట‌మి పాల‌య్యారు. అయితే, అప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్ర‌మాల్లో సురేఖ క్రియాశీలంగా పాల్గొన‌డం లేదు. మ‌రోవైపు పార్టీ త‌ర‌ఫునా పెద్ద‌గా కార్య‌క్ర‌మాలు కూడా జ‌ర‌గ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో బ‌జీఏపీ తెలంగాణ‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్ట‌డంతో... బీజేపీ నేత‌లు ఆమెను సంప్ర‌దించ‌డం, కొండా సురేఖ సైతం సానుకూలంగా స్పందించ‌డం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు చ‌ర్చ‌లు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆమె కండువా క‌ప్పుకోనున్న‌ట్లు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: