జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను ఏకపక్షంగా రద్దు చేశారని, కనీసం రాష్ట్ర ప్రజలు, వారి తరఫు నాయకులతో కూడా కేంద్రం చర్చించలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్ సార‌థ్యంలోని ప్ర‌తిపక్షాలు జమ్ముకశ్మీర్‌లో పర్యటనకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే, విపక్ష నేతల తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. రాజ్యాంగంలో బీఆర్ అంబేద్కర్.. సమానత్వం, ఐక్యతతోపాటు దేశ సమ్రగతకు పెద్ద పీట వేశారు. కానీ 370 అధికరణానికి ఆయన వ్యతిరేకం. అందుకే పార్లమెంట్‌లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతునిచ్చాం అని ఆమె ట్వీట్ చేశారు.


ఇదిలాఉండ‌గా, జ‌మ్ముకశ్మీర్‌లో నిర్బంధంలోకి తీసుకున్న రాజకీయ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కేంద్రాన్ని కోరాయి. రాజకీయ నాయకులను నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను ఏకపక్షంగా రద్దు చేశారని, కనీసం రాష్ట్ర ప్రజలు, వారి తరఫు నాయకులతో కూడా కేంద్రం చర్చించలేదని విమర్శించాయి. కశ్మీర్ లోయలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆరోపించాయి. కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయడం, రాష్ర్టానికి చెందిన మాజీ సీఎంలను, ప్రముఖ రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచడం చాలా తీవ్రమైన విషయమని తెలిపాయి. కష్టకాలంలో ఉన్న కశ్మీర్ ప్రజలకు తాము అండగా ఉంటామని పేర్కొన్నాయి. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ వాజపేయి గొప్ప పార్లమెంటేరీయన్ అని, ఆయన జీవించి ఉండి ఇప్పుడు అధికారంలో ఉంటే జమ్ముకశ్మీర్ విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేదని చెప్పారు. 


మ‌రోవైపు, మాయావ‌తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``రాజ్యాంగం అమలులోకి వచ్చిన 69 సంవ‌త్స‌రాల తర్వాత 370 అధికరణాన్ని రద్దుచేసినందున కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు కొంత సమయం పడుతుందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యను గౌరవిద్దాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే కాంగ్రెస్, ఇతర విపక్షాలకు చెందిన 12 మంది కశ్మీర్‌లో పర్యటనకు వెళ్లడం సబబేనా? ఇది అవకాశ వాద రాజకీయం కాదా?`` అని ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: