చంద్రబాబునాయుడు జనాలకు  గ్రాఫిక్స్ లో  చూపించిన మరో నిర్మాణం ఐకానిక్ వంతెన ప్రతిపాదన మూలపడిపోయింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా చంద్రబాబు మాత్రం జనాలందరికీ త్రిడిలో రాజధాని నిర్మాణాన్ని చూపించేసినట్లే ఐకానిక్ వంతెనలను కూడా గ్రాఫిక్స్ లో బ్రహ్మాండంగా చూపించేశారు. కేంద్రం వద్దని చెప్పినా వెనక్కు తగ్గలేదు. చివరకు ఏమైంది ? అసలే ప్రాజెక్టే పట్టాలకెక్కలేదు.

 

అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు కేంద్రం సూచనలకు అనుగుణంగా ఐకానిక్ స్ధానంలో మామూలు బ్రిడ్జికి జగన్ రూపకల్పన చేస్తున్నారు. జగన్ తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ 400 కోట్లు మిగులుతోంది.

 

కృష్ణానది మీద గొల్లపూడి గ్రామం వద్ద 3.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి కట్టాలని చంద్రబాబు కలలు కన్నారు. అయితే 6 వరుసలతో నిర్మించాలని అనుకున్న ఐకానిక్ వంతెనకు  రూ 800 కోట్లు ఖర్చవుతుందని లెక్క తేలింది. నిజానికి అంత అవసరం లేదు. అయినా అక్కడున్నది చంద్రబాబు కదా ? అందుకనే పదిరూపాయలతో అయ్యే పనికి వంద రూపాయలు ఖర్చు పెట్టించటం బాగా అలవాటైపోయింది. అందుకనే కేంద్రం వద్దన్నా చంద్రబాబు ఒప్పుకోలేదు.

 

చివరకు చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఒప్పుకున్నది. అయితే నిర్మాణ వ్యయానికి అయ్యే 800 కోట్ల రూపాయల్లో రూ 400 కోట్లను రాష్ట్రాన్నే భరించమని చెప్పింది. ఇంకేముంది చంద్రన్న నోరెత్తలేదు మళ్ళీ. చేతిలో డబ్బు లేదు. అందుకనే గ్రాఫిక్స్ ను జనాలకు చూపిస్తూ ఐదేళ్ళు గడిపేశారు. చివరకు జగన్ సిఎం అయిన తర్వాత ఇదే విషయాన్ని కేంద్రంతో చర్చించారు.

 

ఎలాగూ చర్చలు మొదలయ్యాయి కాబట్టి కేంద్రం తన పాత ప్రతిపాదననే జగన్ ముందుంచింది. దానికి జగన్ వెంటనే ఒప్పేసుకున్నారు. తమకు ఐకానిక్ అవసరం లేదని జనాలకు సౌకర్యంగా ఉంటే చాలని చెప్పారు. అదే విషయాన్ని రాత మూలకంగా రాష్ట్రప్రభుత్వం చెప్పటంతో వంతెన నిర్మాణానికి కేంద్రం వెంటనే రెడీ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: