రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ రఫేల్‌ అడ్వాన్స్ డ్ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఇండియాలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంది. ఇప్పటికే కల్యాణి గ్రూపుతో కలిసి హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను చేపట్టింది. మరోపక్క స్థానిక డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఆస్ట్రా మైక్రోవేవ్‌ ప్రోడక్ట్స్ తో కలిసి ఆస్ట్రా రఫేల్‌ కామ్సిస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి నేడు ప్రారంభించబోతున్నారు. 



ఇక్కడ అత్యాధునిక మిలటరీ గ్రేడ్‌ ఎస్‌డీఆర్‌ (సాఫ్ట్ వేర్‌ డిఫైన్డ్‌ రేడియో) తయారీని రఫేల్‌, ఆస్ట్రా మైక్రోవేవ్‌  కలిసి ఏర్పాటు చేశాయి. ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధ సామగ్రికి సంబంధించిన యూనిట్లు తయారు చేయనున్నారని సమాచారం. కల్యాణి గ్రూపు, రఫేల్‌ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ కలిసి హైదరాబాద్‌లో నెలకొల్పిన కల్యాణి రఫేల్‌ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ (క్రాస్‌)కు ఇటీవల భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ నుంచి 100 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టు దక్కింది. వెయ్యి యూనిట్ల బరాక్‌-8 ఎంఆర్‌ శామ్‌ క్షిపణి కిట్లను ‘క్రాస్‌’ సరఫరా చేయాలనేది ఒప్పందం. కాబట్టి.. భవిష్యత్ అవసరాలకు అనువైన ప్రదేశంగా హైదరాబాద్ ను ఎంచుకున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ‘క్రాస్’చర్చలు జరిపినట్టు సమాచారం. 



ఇజ్రాయెల్‌ సంస్థ రఫేల్‌ కొన్నేళ్లుగా మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ మన సైన్యానికి అత్యాధునిక యుద్ధపరికరాలు సరఫరా చేస్తోంది. తన ఆదాయంలో 8 శాతం సొమ్మును ప్రతి ఏటా ఇజ్రాయెలీ రఫేల్‌ పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలపై ఖర్చుపెడుతోంది. దీని ద్వారా ఎలక్ట్రో-ఆప్టిక్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, రాడార్‌/ ఆర్‌ఎఫ్‌ టెక్నాలజీస్‌, ప్రొపల్షన్‌- ఎక్స్ ప్లోజివ్స్‌, బిగ్‌ డేటా- సైబర్‌ టెక్నాలజీస్‌, గైడెన్స్‌- నావిగేషన్‌ లో అడ్వాన్స్డ్ మెషీన్లను ఆవిష్కరిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ సంస్థను ఫ్రాన్స్ కు చెందిన యుధ్ద విమానాల తయారీ సంస్థ రాఫెల్‌ గా అనుకుంటూంటారు. కానీ ఈ రెండు వేర్వేరు సంస్థలు.


మరింత సమాచారం తెలుసుకోండి: