అమిత్ షా..రాజకీయ వ్యూహాలు పన్నడంలో ధిట్ట. తన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్ధులని చిత్తు చేస్తూ...బీజేపీకి ఎలాంటి ఫలితాలు అందించారో అందరం చూశాం. అయితే మొన్నటివరకు రాజకీయ వ్యూహాల్లో దూసుకెళ్లిన అమిత్ షా తొలిసారి కేంద్ర మంత్రి అయ్యి పాలనలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అందులోనూ హోమ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు సమాధానం ఇస్తున్నారు.


తాను అనుకున్నది పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ... ఆరెస్సెస్‌ డిమాండ్లను కూడా నెరవేర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దీర్ఘకాలంగా పెండింగ్ లో జమ్మూ-కశ్మీర్ సమస్యకు ఒక దెబ్బతో సమాధానమిచ్చారు. ఆర్టికల్‌ 370, 45(ఏ) రద్దు చేసి సరికొత్త భారత్ కి నాంది పలికారు. అలాగే ట్రిపుల్‌ తలాక్‌ నిషేధంపైనా అమిత్‌ షా ఇదే నిబద్ధత కనబరిచారు. ఇక ఈ సమస్యలకు విజయవంతంగా చెక్ పెట్టిన అమిత్ షా...దేశాన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న నక్సల్స్ సమస్యపై దృష్టి సారించారు.


కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా, పలు రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ సమస్యపై ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉంది. ఇప్పుడు ఇదే సమస్యని అమిత్ షా టేకప్ చేశారు. నక్సలిజంని అణిచివేసేందుకు అమిత్ షా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళేందుకు చూస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ,ఆరెస్సెస్‌లు కలిసి మొదట అర్బన్‌ నక్సల్స్‌ పేరును పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా మావోయిస్టుల సానుభూతిపరులను టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ మేరకు అమిత్ షా తన వ్యూహాలకు పదును పెట్టారు.  


ఇదిలా ఉంటే తాజాగా హోమ్ మంత్రి అమిత్ షా నక్సల్‌ ప్రభావిత పది రాష్ర్టాల సీఎంలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. నక్సల్స్‌ను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య భావనకే మావోయిస్టులు వ్యతిరేకమని ప్రకటించిన షా... మావోయిస్టుల్ని ఏరిపారేస్తామని హెచ్చరించారు. ఇక మావోయిస్టుల ఏరివేత కోసం నక్సల్‌ ప్రభావిత జిల్లాలకు కేంద్ర ప్రభుత‍్వం భారీగా నిధులు కేటాయించనుంది. అటు మోడీ అధికారంలో ఉన్న 2014–18 మధ్య కాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు 43 శాతం వరకు తగ్గాయని కేంద్ర హోమ్ శాఖ అధికారులు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: