వ‌చ్చే మూడు నెల‌లూ రాష్ట్రంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుందా?  రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో ఆనందా ల హ‌రివిల్లు ఏర్ప‌డ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజకీయ పండితులు... ప్ర‌భుత్వ అధికారులు కూడా! విష‌యంలోకి వెళ్తే .. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ అనూహ్య‌మైన నిర్ణ‌యాల‌తో ముందుకు పోతున్నారు. త‌న మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని ప‌థ‌కాల‌ను కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. 


అది కూడా ఎలా ప‌డితే అలా కాకుండా ఒక ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు సాగుతు న్నారు. ఇప్ప‌టికే పింఛ‌న్లు, నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేకదృష్టి పెట్టి ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌ర్తీ చేస్తున్న ప్ర‌భుత్వం రానున్న మూడు మాసాల్లో కీలక‌మైన హామీల‌ను నెర‌వేర్చే దిశ‌గా అడుగులు వేసేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంది. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌రులో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి  ఆ నెల‌ చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. 


అదేవిధంగా రాష్ట్రంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకునేందుకు కూడా సెప్టెంబ‌రు మాసాన్నే జ‌గ‌న్ ఎంచుకున్నారు. సెప్టెంబరు నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాల‌ని ఆయ‌న అధికారులను ఆదేశించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ.1150 కోట్లు ఇస్తామని జ‌గ‌న్ చెప్పారు. సీఐడీ నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితాను తీసుకుని, గ్రామ వాలంటీర్ల ద్వారా అగ్రిగోల్డ్‌ బాధితులకు రశీదులు ఇవ్వాలని, న‌గ‌దును నేరుగా బ్యాంకుల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.  


అదేస‌మ‌యంలో రేష‌న్ కార్డు దారులకు ముఖ్యంగా తెల్ల‌రేష‌న్ కార్డు దారుల‌కు నాణ్య‌మైన బియ్యం పంపిణీ కార్య‌క్ర‌మానికి కూడా సెప్టెంబ‌రు 1 నుంచే శ్రీకారం చుట్ట‌నున్నారు. ఇక‌, అక్టోబరు 15న రైతు భరోసా పథకం ప్రారంభం కాబోతుంది. రైతు భరోసా కౌలు రైతులకూ ఇవ్వ‌నున్నారు. దీనిపై రైతులు, కౌలు రైతులను ఎడ్యుకేట్‌ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లకు అప్ప‌గించారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయి. రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించ‌నున్నారు. 


అదే విధంగా నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు పోయే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో సహాయం అందజేయ‌నున్నారు. పడవలు, బోట్లు ఉన్నా మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నారు. అదేస‌మ‌యంలో డీజిల్‌పై రాయితీని పెంచారు.  ప్రస్తుతం లీటర్‌పై రూ.6 లు ఇస్తున్నారని, దీనిని రూ.9లకు పెంచబోతున్నారు. ఇది నవంబర్ 21 నుంచి అమ‌ల్లోకి రానుంది. అదే విధంగా డిసెంబర్‌ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇవ్వ‌నున్నారు. జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నారు. 


ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10వేలు ఇవ్వ‌నున్నారు. వైఎస్సార్‌ పెళ్లికానుకను ఫిబ్రవరి చివరి వారంలోనే అమల్లోకి తీసుకు వస్తున్నారు. మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుంది. ఇదే నెలలోనే 25 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నారు.  ఇలా ప్ర‌తి ప‌థ‌కంపైనా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్న జ‌గ‌న్ కార‌ణంగా రాష్ట్రంలో వ‌చ్చే మూడు మాసాలు ద‌స‌రా దీపావ‌ళుల‌తోపాటు.. సంక్షేమ సంద‌డి కూడా పండ‌గ చేయ‌నుంద‌ని అంటున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: