మార్పుకోసం రాజ‌కీయం- అనే స‌రికొత్త నినాదంతో రాజ‌కీయ తెర‌మీదికి వ‌చ్చిన స‌రికొత్త పార్టీ జ‌న‌సేన‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన ఈ పార్టీ పేరులోనే తాము జ‌నాల‌కు సైనికుల‌మ‌ని, వారి త‌ర‌ఫున పోరు సాగించేందుకు, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడేందుకు తాము పూర్తిగా బాధ్య‌త వ‌హిస్తామ‌ని ప‌వ‌న్ సంక‌ల్పం చెప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో 2014లో పార్టీ స్థాపించినా.. 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఆయ‌న ఎక్క‌డా ఎన్నిక‌ల రాజ‌కీయం చేయ‌లేదు. పార్టీ స్తాపించిన వెంట‌నే వ‌చ్చిన ఎన్నిక‌ల‌కూ ఆయన దూరంగా ఉన్నారు. అప్ప‌ట్లో టీడీపీకి, బీజేపీకి మ‌ద్ద‌తిచ్చారు. ఆ త‌ర్వాత వాటితో విభేదించి క‌మ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. తాజా ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. 


అయితే, ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎన్ని హామీలు ఇచ్చినా.. అటు బాబును, ఇటు జ‌గ‌న్‌ను ఎంత విమ‌ర్శించినా.. ప్ర‌జ‌లు మాత్రం ఆయ‌న‌ను పెద్ద‌గా ఖాత‌రు చేయ‌లేదు. దీంతో ఆయనే రెండు చోట్లా ఓడిపోగా.. మిగిలిన పోటీ చేసిన వారిలో ఒక్క రాజోలులో మాత్ర‌మే విజ‌యం సాధించారు. దీంతో రాజ‌కీయాలంటే ఏంటో ప‌వ‌న్ కు తెలిసి వ‌చ్చింది. రాజ‌కీయం వేరు ఎన్నికల రాజ‌కీయం వేర‌ని ఆయ‌న తెలుసుకున్నారు. అయితే, ఎన్నిక‌ల‌న్నాక‌.. గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఒక్క ప‌రాజ‌యంతో పోయేది ఏమీ లేదు. అలా అనుకుంటే 2014లో అధికారంలోకి వ‌స్తామ‌ని భావించిన వైసీపీ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో అయితే.. వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీ త‌ర్వాత వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చి .. ఇప్పుడు పాలిస్తోంది. 


ఇలా రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. కానీ, కార్య‌క‌ర్తల్లోను, నేత‌ల్లోనూ భ‌రోసా మాత్రం ఎప్ప‌టికీ ఉండాలి! ఈ విష‌యంలో మాత్ర‌మే ఇప్పుడు జ‌న‌సేన పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఓడిపోయినా.. ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే, ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండాలంటే.. దానికి త‌గిన వేదిక పార్టీ కార్యాల‌యం, పార్టీ శ్రేణులు! ఈ రెండు విష‌యాల్లోనూ ఇప్పుడు జ‌న‌సేన ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. కార్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌కు డ‌బ్బులు లేక ఎక్క‌డిక‌క్క‌డ మూత బ‌డుతోంది. అదే స‌మయంలో శ్రేణులు కూడా త‌మ దిశ ద‌శ చూపించే నాథుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో పార్టీ నుంచి దూర‌మ‌వుతున్నారు. దీంతో అస‌లు పార్టీ ఉంటుందా? ఉండ‌దా? అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. 


మరీ ముఖ్యంగా..  భీమవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్, నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పోటీచేసి, కనీసం ఓటింగ్ రోజైనా, పోలింగ్ రోజైనా ప్రజల్లోకి రాకపోగా, ఆ తర్వాత కూడా జిల్లావైపు కన్నెత్తి చూడలేదు. తృతీయ స్థానాన్ని కట్టబెట్టి డిపాజిట్లు దక్కేలా కష్టపడ్డ పార్టీ శ్రేణులకు సైతం మొహం చాటేయడంతో  జనసేన పరిస్థితి ఏంటన్న అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. 


వీటికి బలం చేరుకుతున్నట్లుగా ఏకంగా జిల్లా కేంద్రమైన ఏలూరులో అప్పటి వరకూ ఉన్న పార్టీ కార్యాలయం కాస్తా ఆగమేఘా లపై ఖాళీ చేయడంతో, జనసేన అడ్రస్ లేని పార్టీగా మారింది.  ఎన్నికల ముందు జిల్లా కేంద్రమైన ఏలూరులో హంగు, ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన జిల్లా జనసేన కార్యాలయం భవనం ఎన్నికల ఫలితాల తర్వాత ఖాళీ చేసేశారు.  పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయం వైపు చూడకపోవడం, పార్టీని జిల్లా స్థాయిలో నడిపించే నాయకులెవ్వరూ లేకపోవడంతో కార్యాలయ వ్యయ భారం సాకుతో జెండాలు పీకేసి, భవనం ఖాళీ చేసేశారు.  


ఏలూరులో జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ చేయడం, అధినేత పోటీ చేసిన భీమవరంలో నూ పార్టీ కార్యాలయం లేకపోవడంతో జనసేన ఉన్నట్టా.. లేనట్టా.. అనే సందేహాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి మేమున్నామం టూ అప్పుడప్పుడూ అధినేత పవన్ అమరావతిలో సమీక్షలు పెట్టి, కమిటీలు వేసి, కష్టపడ్డవారికి ప్రాతినిథ్యం ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో.. క్షేత్రస్థాయిలో జనసైనికులు  అసహనంతో రగలిపోతున్నారు.


ఓటమి భుజాన వేసుకున్న నాయకులా పార్టీని నడిపించేది, స్థానిక ఎన్నికల్లో మళ్లీ అదే పరాభవం మూటకట్టుకోడానికా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇవిలా ఉంటే.. కొవ్వూరు, గోపాలపురం, ఉండి నియోజకవర్గాలను ఎన్నిక‌ల స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షాల‌కు క‌ట్ట‌బెట్టారు. దీంతో ఇక్క‌డ జ‌న‌సేన కార్యాల‌యం కానీ, సైనికులు కానీ క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలా మొత్తంగా జిల్లాలో జ‌న‌సేన ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి కాయ‌క‌ల్ప చికిత్స‌చేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: