వైసీపీ ప్రభుత్వం 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల కోసం 21 లక్షల 69 వేల ధరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు నిర్వహించబోతుంది. గడచిన కొన్ని రోజులుగా డబ్బులిస్తే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు వస్తాయని దళారులు చెబుతున్నారనే వార్తలు, సోషల్ మీడియాలో ఈ ఉద్యోగాలకు సంబంధించి వదంతులు కూడా వస్తున్నాయి. 
 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసారు. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరగబోతున్నాయని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు డబ్బులు వసూలు చేసారన్న విషయం గురించి ఫిర్యాదులు వస్తున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది దళారులను అరెస్ట్ చేసినట్లు మంత్రి చెప్పారు. 
 
5,314 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్ష నిర్వహణ కొరకు 1,22,554 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సీసీ కెమెరాల నిఘాతో పాటు భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను భద్రపరచినట్లు మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 1 వ తేదీన 15 లక్షల 50 వేల మంది పరీక్షలు రాస్తుండగా నిన్న ఉదయానికి 12 లక్షల 85 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని మంత్రి తెలిపారు. 
 
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 13 జిల్లాలలో పదివేలకు పైగా బస్సు సర్వీసులు ఆర్టీసీ నడపబోతుందని మంత్రి తెలిపారు. ఎస్ ఎం ఎస్ ద్వారా పరీక్ష కేంద్రాల లొకేషన్ ను కూడా అభ్యర్థులకు తెలియజేస్తున్నామని మంత్రి తెలిపారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: