తెలుగు పొలిటికల్‌ స్క్రీన్‌పై మరో స్టార్‌ హీరో డైరెక్ట్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? నటనలో, రాజకీయాల్లో వారసత్వ బలం పుష్కలంగా ఉన్న ఆ హీరో అదును కోసం ఎదురు  చూస్తున్నారా? రాజకీయాల్లోకి లాగేందుకు ఆ హీరోతో నేతలు సంప్రదింపులు జరుపుతున్నారా? ఏపీలో నెలకొన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో .. తమ రాజకీయ ఫ్యూచర్‌ కోసం ఆ హీరోను రంగంలోకి దించేందుకు కొందమంది నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత?


జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం జరగుతోందనే ప్రచారం మొదలైంది... ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీలోకి వెళ్లలేని కొంత మంది నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు టచ్ లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం... టీడీపీ ఘోరంగా ఓడిపోయి, నేతలు బీజేపీ బాట పడుతున్న సమయంలో మరో పార్టీ అవసరం ఏపీలో ఉందనే వాదన రాజకీయ నిరుద్యోగుల్లో ఉంది. తాత నందమూరి తారకరామారావు నటనా వారసుడిగా సినిమాల్లో తనని తాను నిరూపించుకుంటున్నారు జూనియర్‌. స్టార్ ఇమేజ్ తో ఉన్న ఎన్టీఆర్‌కు మంచి వాగ్ధాటి, వర్తమాన పరిస్థితులపై అవగాహన ఉన్న వాడిగా గుర్తింపు ఉంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఆయన ప్రచారం చేసిన సమయంలోనే ఆయనలోని రాజకీయ నాయకుడు ఫోకస్‌ అయ్యాడు. అప్పట్లో రాజకీయాల పట్ల ఆయన ఆసక్తిగా కూడా  ఉండే వారు. జూనియర్ నటించిన కొన్ని సినిమాల్లో పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఉండే డైలాగ్ లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది కూడా.


ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్ గా అప్పట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన జూనియర్ ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాల గొడవలో తాను మునిగిపోయారు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో తారక్ బిజీగా ఉన్నారు. ఆయన పనిలో ఆయన ఉంటే... తెలుగుదేశంతో ఇక లాభం లేదు అనుకుంటున్న ఆ పార్టీ నేతలతోపాటు... మిగలిన పార్టీలలో ఇమడలేమనుకుంటున్న వాళ్లు జూనియర్ వైపు చూస్తున్నారంట. అయితే దీనికి జూనియర్ ఎలా స్పందించారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం 40 ప్లస్ క్లబ్ లో ఉన్న జూనియర్ సినిమాలపైనే తన దృష్టినంతా కేంద్రీకరించారు. తాత ఎన్టీఆర్ సినిమాలలో అన్ని రకాల పాత్రలు పోషించి... అంతిమంగా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. మరి జూనియర్ కూడా అదే ఆలోచనలో ఉంటారా? లేదా అన్నది ఎవరికీ తెలియదు... అంతేకాదు.. అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా?. అన్నది కూడా బయటకు రావడం లేదు.


ఏపీలో టీడీపీ ఓడిపోగానే.... జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగ్రేటంపై చర్చ జరిగింది. ఘోరంగా ఓడిన టీడీపీకి ఇక పునర్జన్మలేదని... జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ పార్టీని కాపాడగలరని... ప్రతిపక్షాల్లో ఉన్న నేతలు కూడా అన్నారు. జూనియర్ కు ఉన్న ఛరిష్మా, కరిష్మా, తాత స్టైల్ రాజకీయంగా కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ పండితులు చెబుతుంటారు. బాబాయి బాలయ్య, లోకేష్ కంటే జూనియర్ లోనే ఎక్కవ పోలిటికల్ యాంగిల్ ఉంటుందనే చర్చ ఎలాగూ ఉంది. వపన్ కల్యాణ్ పెట్టిన జనసేన మొన్నటి ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో సినిమానటులంటే జనంలో క్రేజ్ తగ్గిందనే వారు కూడా .. జూనియర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఫ్యూచర్‌ ఉంటుందని అంటున్నారు. మరి ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి దించాలన్న నేతల ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో ఏమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: