హైదరాబాద్ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్గానిక్ ఫర్టిలైజర్ కంపెనీలో తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకోవటంతో కార్మికులు బయటకు పరుగులు తీసారు. దట్టమైన పొగతో కూడిన మంటలు రావటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. 
 
అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నారు. దాదాపు ఆరు గంటల నుండి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కెమికల్ కంపెనీ పక్కనే ఉన్న బీవేర్ బోర్ వెల్ కంపెనీ పూర్తిగా దగ్ధమైంది. ఈ కంపెనీలో కంప్యూటర్లు, డాక్యుమెంట్లు అన్నీ పూర్తిగా కాలిపోయాయి. ఐదు ఫైర్ ఇంజన్లను ఉపయోగించి మంటలు అదుపు చేస్తున్నప్పటికీ మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఫైర్ ఇంజన్లతో పాటు 25 ట్యాంకర్లను తెప్పించి మంటలను ఆర్పుతున్నారు. 
 
షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 30 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. చాలా కాలం క్రితం నిర్మించిన కంపెనీ కావటం వలన మంటలు ఆర్పటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తుంది. 


ఈ ఘటన గురించి అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ ఉదయం 5 గంటల సమయంలో కాల్ వచ్చిందని మొదట రెండు ఫైర్ ఇంజన్లను పంపామని, తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరో మూడు ఫైర్ ఇంజన్లను ఇతర ప్రాంతాల నుండి తెప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం బోర్ వెల్ కంపెనీ మంటలు అదుపులోకి వచ్చాయని అధికారి తెలిపారు. ఆర్గానిక్ కంపెనీలో ఒక వైపు మాత్రమే ప్రవేశించడానికి వీలు ఉందని రెండు గంటల సమయంలో మంటలు అదుపులోకి వస్తాయని తెలుస్తుందని అధికారి అన్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: