ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఊహించ‌ని వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు స్వామి చిన్మయానంద్ మ‌ళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేసినట్టు తన వద్ద ఆధారాలు ఉండటంతో.. ఉత్తర్‌ప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌లోని ఎస్‌ఎస్‌ లా కాలేజీ డైరెక్టర్‌గా ఉన్న చిన్మయానంద్‌ తనను, తన కుటుంబసభ్యులను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో గత శుక్రవారం లైవ్‌ వీడియో పోస్ట్‌చేశారు. ఇది వైరల్‌గా మారింది. అయితే, విద్యార్థిని కళాశాల హాస్టల్‌ నుంచి అదృశ్యమైంది.


స్వామి చిన్మయానంద్ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని ఆరోపించిన ఆ అమ్మాయి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తనను ఆదుకోవాలని అందులో వేడుకున్నారు. ‘నాది షాజహాన్‌పూర్‌. నేను ఎస్‌ఎస్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నాను. ఓ స్వామిజీ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. అతనికి వ్యతిరేకంగా నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ నన్ను ఆదుకోవాలి. నాకు న్యాయంచేయండి’ అంటూ వీడియోలో విజ్ఞప్తిచేశారు. శుక్రవారం ఈ వీడియో షేర్‌ చేసిన విద్యార్థిని.. శనివారం నుంచి అదృశ్యమైంది. 


కొన్ని సంవ‌త్స‌రాలపాటు స్వామి చిన్మయానంద్‌ ఆశ్రమంలో ఉన్న ఒక అమ్మాయి ఫిర్యాదు మేరకు అతనిపై 2011 నవంబర్‌లోనూ లైంగికదాడి, వేధింపుల కేసు నమోదైంది. అయితే, ఆ కేసును ఎత్తివేయాలని గత ఏడాది యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలాఉండగా, న్యాయ కళాశాలలో ఉన్న విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు స్వామి చిన్మయానంద్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కిడ్నాప్‌, బెదిరింపుల కేసును నమోదు చేశారు. అయితే బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నట్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలను మాత్రం పట్టించుకోలేదు. కాగా, ఈ ఉదంతంపై ప్ర‌భుత్వం తీరు స‌రిగా లేద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: